మూడో టెస్టుకు కివీస్ పేసర్ సౌథీకి పిలుపు

న్యూజిలాండ్ టెస్టు జట్టులో పేసర్ టిమ్ సౌథీకి చోటు కల్పించారు. ఏప్రిల్ మూడో తేదీ నుంచి వెల్లింగ్టన్ స్టేడియంలో భారత్‌తో మూడో టెస్టును కివీస్ ఆడనుంది. టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందు జరిగిన వన్డే సిరీస్‌‌లో భాగంగా మూడో వన్డే మ్యాచ్‌లో సౌథీ పది ఓవర్లు వేసి 105 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో అతన్ని జట్టు నుంచి తప్పించారు.

ఈ నేపథ్యంలో నేపియర్‌లో జరిగిన రెండో టెస్టులో భారత్‌ను తొలి ఇన్నింగ్స్‌లో కట్టడి చేసినప్పటికీ, రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం కివీస్ బౌలర్లు విఫలమయ్యారు. ఫలితంగా భారత్ ఓటమి కోరల నుంచి గట్టెక్కి, డ్రాగా ముగించుకుంది. దీంతో మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది.

దీనిపై న్యూజిలాండ్ క్రికెట్ సెలక్షన్ ప్యానెల్ హెడ్ గ్లెన్ టర్నర్ మాట్లాడుతూ.. 20 సంవత్సరాల సౌథీ చేరడం వల్ల జట్టు బౌలింగ్ విభాగం మరింత పటిష్టంగా మారుతుందన్నారు. సౌథీ కొత్త బంతిని పంచుకుంటాడని, అత్యంత బలమైన భారత బ్యాటింగ్‌ లైనప్‌ను ఎదుర్కొనేందుకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని చెప్పాడు.

కివీస్ జట్టు వివరాలు.. డేనియల్ వెటోరి (కెప్టెన్), డేనియల్ ఫ్లైన్, జేమ్స్ ఫ్రాంక్లిన్, మార్టిన్ గుప్తిల్, బ్రెండెన్ మెక్‌కల్లమ్, టిమ్ మంటోష్, క్రిస్ మార్టిన్, కైల్ మిల్స్, ఓబ్రియన్, జీతన్ పటేల్, జెస్సీ రైడర్, టిమ్ సౌథీ, రాస్ టేలర్.

వెబ్దునియా పై చదవండి