ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి తాను రిటైరయ్యేంత వరకు బాలీవుడ్ బాద్షా ఫ్రాంచైజీ జట్టు కోల్కతా నైట్ రైడర్స్ తరపున ఆడుతానని బెంగాల్ దాదా సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు. ఐపీఎల్-4లో పూణే ఫ్రాంచైజీ జట్టు తరపున బెంగాల్ టైగర్, టీం ఇండియా మాజీ కెప్టెన్, సౌరవ్ గంగూలీ ఆడుతాడని వెలువెత్తిన వార్తలను దాదా తోసిపుచ్చాడు.
ఇంకా ఎన్ని కొత్త ఫ్రాంచైజీ జట్లు పరిచయమైనా ఐపీఎల్లో రిటైర్ అయ్యేంతవరకు కేకేఆర్ తరపున ఆడుతానని సౌరవ్ స్పష్టం చేశాడు. అయితే తనకు ఇప్పట్లో రిటైరయ్యే ఆలోచన లేదని గంగూలీ తెలిపాడు.
ఇదిలా ఉంటే.. పూణే ఫ్రాంచైజీ జట్టు తరపున ఐపీఎల్-4లో సౌరవ్ ఆడుతాడని, ఇంకా త్వరలో రిటైర్మెంట్ కూడా ప్రకటించనున్నాడని వార్తలు గుప్పుమన్నాయి. ఈ వార్తలపై సౌరవ్ గంగూలీ స్పందిస్తూ.. పై వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నాడు. ప్రస్తుతం ఫామ్లో ఉన్న తాను రిటైర్మెంట్పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశాడు.
ఇంకా షారూఖ్ మాట్లాడుతూ.. గంగూలీ రిటైర్మెంట్ ప్రకటించే ఆలోచనలో లేదని, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, అనిల్ కుంబ్లే వంటి లెజండ్ క్రికెటర్ల తరహాలో ఐపీఎల్లో కొనసాగుతాడని తెలిపారు.