విజయానికి 302 పరుగుల దూరంలో ద.ఆఫ్రికా

మంగళవారం, 10 మార్చి 2009 (08:54 IST)
భారీ లక్ష్య ఛేదనలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న దక్షిణాఫ్రికా జట్టు ఇన్నింగ్స్ మరో ప్రపంచ రికార్డును నమోదు చేసుకునే దిశగా సాగుతోంది. సొంతగడ్డ డర్బన్‌లో పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టుతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో 546 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సఫారీల ప్రయాణం ప్రస్తుతానికి సాఫీగా సాగుతోంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా జట్టు రెండు వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది. ప్రత్యర్థి ఆస్ట్రేలియా తమ ముందు ఉంచిన 546 పరుగుల లక్ష్యానికి మరో 302 పరుగుల దూరంలో ఉంది.

నాలుగో రోజు బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా జట్టుకు ఓపెనర్లు ఇద్దరు 80 పరుగులకే పెవిలియన్‌కు చేరుకున్నారు. అయితే, జాక్వెస్ కెల్లీస్ (84), డీ విలియర్స్ (68)లు అద్భుతంగా రాణించి 164 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో విజయంపై ఆశలు నెలకొన్నాయి. ఐదో రోజున 302 పరుగులు చేయాల్సిన దక్షిణాఫ్రికా జట్టుకు చేతిలో ఎనిమిది వికెట్లు ఉన్నాయి. ఈ లక్ష్యాన్ని ఛేదిస్తే.. ప్రపంచ టెస్ట్ క్రికెట్‌లో మొట్టమొదటి తొలి భారీ లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా దక్షిణాఫ్రికా ప్రపంచ రికార్డు పుటలకెక్కుతుంది.

ఇటీవల ఆసీస్ గడ్డపై 472 పరుగుల భారీ లక్ష్యాన్ని అధికమించిన అనుభవం సఫారీల సొంతం. ఇదిలావుండగా, తొలి టెస్ట్‌లో ఆస్ట్రేలియా జట్టు విజయం సాధించి, సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని కూడబెట్టుకున్న విషయం తెల్సిందే. అంతకుముందు.. ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 352 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లకు 331 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దక్షిణాఫ్రికా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 138 పరుగులకే కుప్పకూలింది.

వెబ్దునియా పై చదవండి