నాలుగో వన్డేలో టీం ఇండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.. మెరుపుదాడికి తమ బౌలర్ల వద్ద సమాధానమే లేకుండా పోయిందని న్యూజిలాండ్ కెప్టెన్ డానియర్ వెటోరీ అభిప్రాయం వ్యక్తం చేశాడు.
నాలుగో వన్డే పరాజయం అనంతరం వెటోరీ మీడియాతో మాట్లాడుతూ... వీరూ బ్యాటింగ్ అద్భుతమనీ, అసలు వర్ణించేందుకు మాటలే రావడంలేదని అన్నాడు. వీరూ విధ్వంసకర బ్యాటింగ్‌కు పగ్గాలు వేయడం చేతగాని కివీస్ బౌలింగ్ పూర్తిగా దాసోహమవ్వాల్సి వచ్చిందని ఆయన వ్యాఖ్యానించాడు.
గత మ్యాచ్‌లలో కంటే తాము మెరుగ్గా బౌలింగ్ చేసినప్పటికీ, వీరూ దూకుడుకు అడ్డుకట్ట వేయలేకపోయామని, అతని జోరును అడ్డుకునేందుకు ఆ స్థాయి బౌలింగ్ సరిపోలేదని వెటోరీ పేర్కొన్నాడు. అందుకే, మైదానంలో నలువైపులా నిప్పులు చెరుగుతూ బంతులను పరుగులు తీయించిన అతడి ఆటతీరుకు తమ బౌలర్ల వద్ద సమాధానమే లేకుండా పోయిందని ఆయన వాపోయాడు.
ఇదిలా ఉంటే... బుధవారం జరిగిన నాలుగో వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో వీరూ చెలరేగి ఆడి 75 బంతుల్లోనే 125 పరుగులు సాధించి టీం ఇండియాను విజయం వాకిట్లో నిలిపిన సంగతి తెలిసిందే.