ఆస్ట్రేలియాకు షాకిచ్చిన జింబాబ్వే : 31 యేళ్ల తర్వాత విక్టరీ!

సోమవారం, 1 సెప్టెంబరు 2014 (14:50 IST)
ప్రపంచ అగ్రశ్రేణి జట్టు ఆస్ట్రేలియాకు క్రికెట్ పసికూనలు కలిగిన జింబాబ్వే జట్టు గట్టి షాకిచ్చింది. సొంత గడ్డపై జరుగుతున్న ముక్కోణపు సిరీస్‌లో ఆ జట్టు కంగారులపై మూడు వికెట్ల తేడాతో గెలుపొందింది. గత కొంతకాలంగా మెరుగైన ఆటతీరును కనబరుస్తున్న జింబాబ్వే ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆసీస్‌ను చిత్తు చేసింది. 
 
హరారే వేదికగా జరిగిన వన్డే మ్యాచ్‌లో చిగుంబురా నాయకత్వంలోని జింబాబ్వే 3 వికెట్ల తేడాతో ఆసీస్‌ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 209 పరుగులు చేసింది. అనంతరం, ఆతిథ్య జింబాబ్వే జట్టు మరో రెండు ఓవర్లు మిగిలివుండగానే జయభేరి మోగించింది. 
 
చిగుంబురా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి 52 పరుగులతో అజేయంగా నిలవగా, బౌలర్ ఉత్సేయా (30*) పరుగులతో కెప్టెన్‌కు తన వంతు సహకారం అందించాడు. దీంతో, ఆ జట్టు 48 ఓవర్లలో 7 వికెట్లకు 211 పరుగులు చేసింది. తద్వారా ఆస్ట్రేలియాపై 31 ఏళ్ళ తర్వాత విజయం సాధించింది. 1983లో జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్‌లో ఆసీస్‌ను జింబాబ్వే ఓడించిన విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి