ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో సీజన్‌లో అత్యధిక విజయాలతో అగ్రస్థానంలో కొనసాగుతోన్న సచిన్ టెండూల్కర్ సేన ముంబై ఇండియన్స్‌తో.. చెన్నై సూపర్ కింగ్స్ మంగళవారం తలపడనుంది. ఇప్పటి వరకు ఆడిన 8 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో ఏడింటిలో విజయాన్ని, కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే పరాజయాన్ని చవిచూసిన ముంబై ఇండియన్స్ జట్టు.. ధోనీ సేన మట్టి కరిపించే దిశగా బరిలోకి దిగుతోంది.
కానీ.. రాజస్థాన్ రాయల్స్‌తో శనివారం జరిగిన 32వ లీగ్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్ అత్యధిక పరుగుల రికార్డును సృష్టించింది. రాయల్స్‌పై గెలుపొందిన జోరుతో ఉన్న చెన్నై ముంబై ఇండియన్స్‌ను ఓడించడమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. రాయల్స్ జరిగిన మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన మోర్కెల్, విజయ్‌ల బ్యాటింగ్ శైలి.. ముంబైని కూడా ఓడిస్తుందని చెన్నై భావిస్తోంది.
అయితే ప్రస్తుతం 14 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోన్న ముంబై ఇండియన్స్‌ను నాలుగో స్థానంలో ఉన్న ధోనీ సేన నెగ్గడం సులభం కాదని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకునే దిశగా ముంబై ఇండియన్స్ ప్రతి మ్యాచ్‌లోనూ రాణిస్తోందని వారు అంటున్నారు.
ఇదిలా ఉంటే.. ఐపీఎల్ మూడోసీజన్‌లో సచిన్ టెండూల్కర్ సేన రాయల్ ఛాలెంజర్స్‌తో జరిగిన రెండో లీగ్ మ్యాచ్‌లో మాత్రమే ఓటమిని చవిచూసింది.