ఐపీఎల్-3: సచిన్ సేనకు నాలుగో విజయం

FILE
జార్ఖండ్ డైనమైట్ మహేంద్ర సింగ్ ధోనీ మళ్లీ జట్టులోకి వచ్చినా చెన్నై వరుస పరాజయాలను ఏ మాత్రం అడ్డుకోలేకపోయాడు. కాగా.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో అంచె పోటీలలో భాగంగా గురువారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ సేన ముంబయి ఇండియన్స్ 5 వికెట్ల తేడాతో చెన్నై సూపర్‌కింగ్స్‌ను చిత్తుగా ఓడించింది. దీంతో ఈ మెగా టోర్నీలో ముంబయి జట్టుకు నాలుగో విజయం దక్కగా, చెన్నై వరుసగా నాలుగో పరాజయం చవిచూసింది.

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబయి ఇండియన్స్.. మొదట్లో చెన్నయ్‌ని కట్టడి చేయడంలో విఫలమైనా, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ (52 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 72), శిఖర్ ధావన్ (34 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 56) చెలరేగి ఆడటంతో ఐదు వికెట్ల నష్టానికి మరో ఓవర్ మిగిలి ఉండగానే 184 పరుగులు సాధించి అలవోక విజయాన్ని సొంతం చేసుకుంది.

అంతకుముందు బ్యాటింగ్ చేపట్టిన చెన్నై మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగి ఆడింది. ముఖ్యంగా సురేశ్ రైనా 83 నాటౌట్, బద్రీనాథ్ 55 పరుగుల వ్యక్తిగత స్కోరుతో రికార్డు స్థాయిలో 142 అత్యధిక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. భారీ షాట్లు ఆడిన రైనా.. ఫోర్లు, సిక్సర్లతో ముంబయి బౌలర్లను పరుగులు పెట్టించాడు. ఆఖరి ఓవర్లలో బద్రీనాథ్ కూడా ధాటిగా ఆడాడు. ఇతర బ్యాట్స్‌మెన్లు కూడా నిలకడగా ఆడటంతో చెన్నై రెండు వికెట్ల నష్టానికి 180 పరుగులు సాధించినా ఓటమి నుంచి తప్పుకోలేకపోయింది.

వెబ్దునియా పై చదవండి