కరేబియన్ గడ్డపై జరుగుతున్న ప్రతిష్టాత్మక ట్వంటీ-20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో టీం ఇండియా ఆదివారం సఫారీలతో బరిలోకి దిగనుంది. గ్రూప్-సిలో అగ్రస్థానంలో నిలవాలంటే.. మహేంద్ర సింగ్ ధోనీ సేన... దక్షిణాఫ్రికాపై గెలిచి తీరాల్సిన అవసరం ఉంది. ఇంకా ఈ మ్యాచ్‌లో గెలిచిన పాయింట్లు కూడా టీం ఇండియా సూపర్-8కి కీలకం కాబట్టి.. ధోనీ సేన గట్టిపోటీని ప్రదర్శించాల్సి వస్తుంది.
మరోవైపు దక్షిణాఫ్రికా జట్టుకు కూడా ఈ మ్యాచ్ కీలకం కావడంతో మహేంద్ర సింగ్ ధోనీ సేనపై మెరుగైన ఆటతీరును ప్రదర్శిస్తోందని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. మేజర్ టోర్నమెంట్లలో తడబడుతున్న గ్రేమ్ స్మిత్ సేన ఈసారి ఎలాగైన నెగ్గి గత చరిత్రను తిరగరాయాలని భావిస్తోంది.
స్మిత్, బోస్మన్, కలిస్, డుమిని, మోర్కెల్, గిబ్స్, డివిలియర్స్, బౌచర్‌లతో కూడిన బ్యాటింగ్ ఆర్డర్‌తో దక్షిణాఫ్రికా పటిష్టంగా ఉంది. బౌలింగ్‌లో స్టెయిన్‌పైనే భారీ ఆశలున్నాయి. అయితే గంభీర్, ధోనీ, ఆశిష్ నెహ్రా, మురళీ విజయ్‌లతో సమరానికి సిద్ధమైన టీం ఇండియా.. ఈసారి ప్రపంచకప్‌ను సాధించాలని తహతహలాడుతోంది.