ముక్కోణపు సిరీస్‌లో భాగంగా కొలంబోలో న్యూజిలాండ్‌తో జరిగిన రెండవ మ్యాచ్‌లో 156 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు 9.3 ఓవర్లు మిగిలి ఉండగానే ఆరు వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై సునాయాసంగా విజయాన్ని చేజిక్కించుకుంది.
ఓపెనర్ కార్తీక్ నాలుగు పరుగులు చేసి మిల్స్ జట్టు స్కోరు ఏడు పరుగులవద్ద ఔటైనాడు. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన ద్రావిడ్, సచిన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను దారిలో పెట్టే ప్రయత్నం చేశాడు. ఈ సమయంలో వెట్టోరి, ఓరమ్‌లు విజృంభించి సచిన్, ద్రావిడ్‌లను ఔట్ చేశారు.
ఆ తర్వాత యువరాజ్ సింగ్ భారీ షాట్‌కు ప్రయత్నించి వెట్టోరి బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. సచిన్ 46, ద్రావిడ్ 14, యువరాజ్ 8 పరుగులకే ఔట్ అయ్యారు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ 46.3 ఓవర్లలోనే 155 పరుగులు సాధించి ఆలౌట్ అయ్యింది. భారత భౌలర్లు సమిష్టిగా రాణించడంతో న్యూజిలాండ్ జట్టును తక్కువ స్కోరుకే కట్టడి చేసింది.