టీం ఇండియాతో స్వదేశంలో ఐదు వన్డేల సిరీస్‌లో ఆడేందుకు న్యూజిలాండ్ వన్డే జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు శనివారం ప్రకటించింది. ఇటీవల ముగిసిన రెండు ట్వంటీ20 మ్యాచ్‌ల్లో అద్భుతంగా రాణించిన ఫాస్ట్ బౌలర్ ఇయాన్ బట్లర్.. సరిగ్గా ఐదు సంవత్సరాల తర్వాత తుది జట్టులో చోటు దక్కించుకోగా, కైల్ మిల్స్ కూడా జట్టుకు ఎంపికయ్యాడు.
ఇయాన్ ఓ బ్రయాన్, బట్లర్, టిమ్ సౌథీలతో కూడిన కివీస్ పేస్ దళంలోకి రెండువారాల తరువాత మిల్స్ మళ్లీ వచ్చిచేరాడు. అలాగే గాయం కారణంగా గత కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉండి... ట్వంటీ20లో ఆడిన జాకబ్ ఓరమ్, పీటర్ ఫుల్టన్ స్థానంలో తిరిగి తుది జట్టుకు ఎంపికయ్యాడు.
వీరితోపాటు బ్రెండన్ దియామంటి స్థానంలో జెస్సీ రైడర్ జట్టులో చోటు సంపాదించాడు. ఇక... ట్వంటీ20 మ్యాచ్‌లలో విఫలమైన నాథన్ మెక్‌కల్లమ్, థామ్సన్‌లకు వన్డే జట్టులో చోటు లభించలేదు. అలాగే, ఆఫ్‌స్పిన్నర్ జీతన్ పటేల్‌కు కూడా వన్డే జట్టులో చోటు దక్కలేదు.