టీం ఇండియా-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా, శనివారం జరుగనున్న ఆఖరి వన్డే మ్యాచ్‌లో కూడా గెలిచి, క్వీన్‌స్వీప్ చేసేందుకు భారత్ ఉవ్విళ్లూరుతోంది. అక్లాండ్‌లోని ఈడెన్ పార్క్‌లో జరుగబోయే ఈ మ్యాచ్‌లో రిజర్వ్ ఆటగాళ్లను బరిలోకి దింపాలని భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, జట్టు మేనేజర్లు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఐదు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే టీం ఇండియా 3-0తో సిరీస్‌ను తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. కాగా, గాయం కారణంగా నాలుగో వన్డే మ్యాచ్‌కు దూరంగా ఉన్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్.. ఐదో మ్యాచ్‌లో కూడా విశ్రాంతి తీసుకుని, ఈనెల 18 నుంచి జరగబోయే టెస్ట్ సిరీస్‌కు పూర్తి ఫిట్నెస్తో ఉండాలని భావిస్తున్నట్లు అర్థమవుతోంది.
ఇప్పటిదాకా... భారత జట్టుకుపరిస్థితులు అనుకూలంగా ఉండగా, ఆతిథ్య కివీస్ జట్టు ఈ మ్యాచ్‌ను ఎలాగైనా గెలుపొందాలన్న పట్టుదలతో ఉంది. స్వదేశంలో వరుసగా ఆరు సిరీస్‌లు గెలుపొందడం అదృష్టం వల్ల కాదనీ... వన్డే పోటీల్లో తాము కూడా విజయాలు సాధించగల జట్టేనని నిరూపించుకోవాలని న్యూజిలాండ్ తహతహలాడుతోంది.
అయితే సిరీస్ విజయంతో సంబంధం లేని ఐదో వన్డే మ్యాచ్‌ను అంత తేలికగా తీసుకోవడం లేదని భారత జట్టు కోచ్ గారీ కిర్‌స్టెన్ స్పష్టంగా వెల్లడించాడు. వన్డే సిరీస్ ఊపుతోనే మూడు టెస్ట్‌లలో కూడా విజయ పరంపర కొనసాగించాలని అతడు భావిస్తున్నాడు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓఝా, మీడియం పేసర్ ఇర్ఫాన్ పఠాన్, స్వదేశానికి తిరిగి వెళ్లే ముందు ఒక వన్డే పోటీలో ఆడే అవకాశం పొందనున్నారు.
ఈ సిరీస్ ముగిశాక వారిద్దితో పాటు యూసుఫ్ పఠాన్, ప్రవీణ్ కుమార్, రోహిత్ శర్మలు ఆదివారం స్వదేశానికి తిరుగు ప్రయాణమవుతారు. ఇశాంత్ శర్మ పక్కన కూర్చున్న కారణంగా నాలుగు వన్డేల్లో పూర్తి బౌలింగ్ భారం వహించిన జహీర్ ఖాన్ కూడా చివరి వన్డేకు రెస్ట్ తీసుకుని, టెస్ట్ సిరీస్‌కు సిద్ధమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
న్యూజిలాండ్‌లోని మైదానాల్లో అతి చిన్నదైన ఇక్కడి ఈడెన్ పార్క్‌లో ఎన్ని బంతులు కనిపించకుండా పోతాయోనని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక్కడ ఇంతవరకూ జరిగిన రికార్డు సంఖ్యలో(ట్వంటీ మ్యాచ్ ల్లో 24, వన్డే మ్యాచ్‌ల్లో 31) సిక్సర్లు రికార్డు కావడం గమనార్హం.
జట్ల వివరాలు : టీం ఇండియా : మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్), వీరేంద్ర సెహ్వాగ్, గౌతం గంభీర్, యువరాజ్ సింగ్, సురేష్ రైనా, రోహిత్ శర్మ, యూసుఫ్ పఠాన్, హర్భజన్ సింగ్, ప్రవీణ్ కుమార్, జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ, దినేష్ కార్తీక్, ఇర్ఫాన్ పఠాన్, ప్రజ్ఞానో ఓఝా.
న్యూజిలాండ్ : డేనియల్ వెటోరి (కెప్టెన్), మార్టిన్ గుప్తిల్, బ్రెండన్ మెక్కల్లమ్, పీటర్ మెక్గ్లాసన్, లైన్ ఓ బ్రియాన్, జాకబ్ ఓరమ్, జెస్సీ రైడర్, రాస్ టేలర్, గ్రాంట్ ఎలియట్, కెయిల్ మిల్స్, ఈవెన్ థాంప్సన్, జీతన్ పటేల్.