ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో తొలిసారిగా ఫైనల్లోకి దూసుకెళ్లిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సేన ముంబై ఇండియన్స్‌కు గట్టి దెబ్బ తగిలింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో బుధవారం జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ చేతి వేలికి గాయం ఏర్పడింది. దీంతో సచిన్ వేలికి వైద్యులు ఐదు కుట్లు వేశారని వార్తలొస్తున్నాయి.
అయితే చేతికి గాయం తగిలినా ఆదివారం (25వ తేదీ) జరుగనున్న ఫైనల్ మ్యాచ్‌లో ఆడుతానని సచిన్ టెండూల్కర్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. బెంగళూరుతో జరిగిన సెమీఫైనల్ తొలి మ్యాచ్ నాలుగో ఓవర్ వద్ద రాహుల్ ద్రావిడ్ బంతిని సచిన్ టెండూల్కర్ వికెట్‌గా మలిచాడు. ద్రావిడ్ బంతిని క్యాచ్ చేయడంలో సచిన్ చేతి వేలికి గాయం తగిలింది.
సెమీస్ తొలి మ్యాచ్‌లో బెంగళూరుపై నెగ్గిన సందర్భంగా ముంబై ఇండియన్స్ కెప్టెన్ సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ.. కుడిచేతి వేలికి గాయం తగిలిందని, ఐదు కుట్లు పడ్డాయని చెప్పాడు. కానీ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లోపు గాయం నుంచి కోలుకుంటానని చెప్పాడు. దీంతో ఫైనల్లో తప్పకుండా ఆడుతానని మాస్టర్ నమ్మకం వ్యక్తం చేశాడు.
ఈ సందర్భంగా బెంగళూరుపై నెగ్గడంలో కీలక పాత్ర పోషించిన అంబటి రాయుడు (40), తివారీ (52 నాటౌట్)లపై ఆటతీరుపై ప్రశంసల వర్షం కురిపించాడు. తివారీ, అంబటి రాయుళ్ల అద్భుతమైన బ్యాటింగ్‌తో 184 పరుగుల భారీ స్కోరును ముంబై నమోదు చేసుకోగలిగిందని చెప్పాడు.
ఒత్తిడిని పక్కన బెట్టి తివారీ, రాయుడులు మనోధైర్యంతో క్రీజులో రాణించారని మాస్టర్ కితాబిచ్చాడు. ఇంకా పోలార్డ్ ఆటతీరుతో పాటు జట్టు సభ్యులందరినీ సచిన్ కొనియాడాడు.