జాక్వెస్ కెల్లీస్‌కు దక్షిణాఫ్రికా కెప్టెన్ పగ్గాలు

శుక్రవారం, 13 మార్చి 2009 (17:11 IST)
దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు తాత్కాలిక కెప్టెన్‌గా సీనియర్ బ్యాట్స్‌మెన్ జాక్వెస్ కెల్లీస్ నియమితులయ్యారు. రెండో టెస్ట్‌కు ఆ బాధ్యతలు నిర్వహించిన ఓపెనర్ ఆష్వాల్ ప్రిన్స్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించారు. ఈ విషయాన్ని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ప్రకటించింది.

ప్రస్తుతం స్వదేశంలో ఆస్ట్రేలియా జట్టుతో జరుగుతున్న మూడు టెస్ట్‌ల సిరీస్‌లో ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టు 2-0 తేడాతో వెనుకబడి ఉన్న విషయం తెల్సిందే. కాగా, తొలి టెస్ట్‌‌లో కెప్టెన్ గ్రేమ్ స్మిత్ వేలి గాయంతో రెండో టెస్ట్‌కు దూరమైన విషయం తెల్సిందే. ఈ టెస్ట్‌లో ద.ఆఫ్రికా జట్టు 175 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో రెండో టెస్ట్ బాధ్యతలను ఓపెనర్ ఆష్వాల్ ప్రిన్స్‌కు అప్పగించారు.

అయితే, కెప్టెన్సీ బాధ్యతల కారణంగా ఓపెనర్ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడంలో ప్రిన్స్ పూర్తిగా విఫలమయ్యాడు. ఫలితంగా రెండో టెస్ట్‌లోనూ దక్షిణాఫ్రికా జట్టు ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో మూడో టెస్ట్‌కు కెప్టెన్సీ బాధ్యతలను కెల్లీస్‌కు అప్పగించారు. ఓపెనర్‌గా రాణించేందుకు ప్రిన్స్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పిస్తూ ఈ చర్య తీసుకున్నట్టు క్రికెట్ దక్షిణాఫ్రికా ప్రకటించింది. ప్రిన్స్ సుమారు 47 టెస్టులకు ఓపెనర్‌గా బరిలోకి దిగారు.

వెబ్దునియా పై చదవండి