వెస్టిండీస్‌లోని కరేబియన్ దీవులలో జరుగుతున్న ట్వంటీ 20 ప్రపంచ కప్‌లో బంగ్లాదేశ్, పాకిస్థాన్ జట్లు శనివారం తలపడనున్నాయి. ఓ వైపు సంచలనాత్మక ఆటతీరుతో దూసుకెళ్తున్న బంగ్లా, మరో వైపు అస్థిర ఆటతీరుకు మారుపేరైన పాక్ జట్ల మధ్య నేడు జరిగే పోరు ఆసక్తికరంగా సాగనుంది.
వార్మప్ మ్యాచ్‌లో జింబాబ్వే చేతిలో డీలా పడినప్పటికీ, ఏ మాత్రం బాధపడని బంగ్లాదేశ్ జట్టు, పాక్‌తో పూర్తి స్థాయిలో సన్నద్ధం అవుతోంది. అయినప్పటికీ గత టీ20 మ్యాచ్‌లలో బంగ్లా జట్టు ప్రదర్శన ఏ మాత్రం సంతృప్తికరంగా లేదు. 2006, 2007లో ఆడిన 14 టీ20 మ్యాచ్‌లలో బంగ్లా కేవలం మూడు మ్యాచ్‌లలో మాత్రమే నెగ్గింది. అలాగే గత టీ20 ప్రపంచ కప్‌లో ఆడిన ఏడు మ్యాచ్‌లలో ఒకే ఒక్క మ్యాచ్‌లో మాత్రమే గెలుపొందటం గమనార్హం.
ఇక పాక్ విషయానికి వస్తే.. గత సంవత్సరం నుంచి చాలా కొద్ది టీ20 మ్యాచ్‌లను మాత్రమే ఆడింది. జట్టులోని అగ్రశ్రేణి ఆటగాళ్లు వివిధ కారణాలతో నిషేధానికి గురికావటమేగాకుండా.. కీలకమైన ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్, బౌలర్ రాణా నవేద్ ఉల్ హసన్‌లు కూడా ప్రస్తుతం టీ20 వరల్డ్‌కప్‌కు అందుబాటులో లేకపోవటంతో పాక్ కలవరపడుతోంది. అయితే జట్టును ఆందోళనపరిచే అంశాలపై దృష్టి పెట్టకుండా తమ శక్తిమేరకు రాణిస్తామని కెప్టెన్ షాహిద్ అఫ్రీదీ ధీమా వ్యక్తం చేస్తున్నాడు.