ట్వంటీ 20 వరల్డ్ కప్: లంకపై వెట్టోరీ సేన విజయం

FILE
కరేబియన్ దీవుల్లో జరుగుతున్న ట్వంటీ 20 ప్రపంచ కప్‌లో వెట్టోరీ సేన బోణీ చేసింది. గయానాలో శుక్రవారం రాత్రి జరిగిన ప్రారంభ మ్యాచ్‌లో శ్రీలంకతో తలపడిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 136 పరుగుల విజయ లక్ష్యాన్ని మరో బంతి మిగిలి ఉండగానే చేధించింది. రైడర్ 27 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో మెరుపులు కురిపించటంతో న్యూజిలాండ్ సేనకు తొలి మ్యాచ్‌లోనే విజయం లభించింది.

ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 135 పరుగులు సాధించింది. మహేల జయవర్ధనే 51 బంతుల్లో 81 పరుగులు సాధించినా, జట్టులోని ఇతర బ్యాట్స్‌మన్‌లు ఎవరూ ఎక్కువ సమయం క్రీజులో నిలువలేకపోయారు. దీంతో పది ఓవర్లలో లంక జట్టు కేవలం 54 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మన్లు ఓ మేరకు ఆడటంతో లంక ఆ మాత్రం స్కోరునైనా చేయగలిగింది.

అనంతరం 136 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన న్యూజిలాండ్ ప్రారంభంలోనే తడబడింది. ఓపెనర్ బెర్నాడ్ మెక్‌కల్లమ్ డకౌట్ కావటంతో, మరో ఓపెనర్ రైడర్ సంయమనంతో ఆడుతూ జట్టు స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. అయితే అతన్ని ఎక్కువ సమయంలో క్రీజులో ఉండనీయని లంక బౌలర్ మురళీధరన్ పెవిలియన్ చేర్చాడు. దీంతో కివీస్ స్కోరు తాబేలు నడకలా సాగింది. అయితే చివర్లో బ్యాటింగ్‌కు దిగిన ఓరమ్ 15, నాథన్ మెక్‌కల్లమ్ 16 పరుగులను సాధించటంతో వెట్టోరి సేన గెలుపొందింది.

ఇదిలా ఉంటే.. టోర్నీ ప్రారంభమైన తొలి రోజున మరో మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో తలపడిన వెస్టిండీస్ ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన వెస్టీండీస్‌, తొమ్మిది వికెట్లనష్టానికి 138 పరుగులు సాధించింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన ఐర్లాండ్‌ 68 పరుగులకే ఆలౌట్‌ అయింది. విండీస్‌ ఆటగాడు డెరీన్‌సమ్మీ ఆల్‌రౌండ్‌ ప్రతిభ ప్రదర్శించడంతో వెస్టీండీస్‌ అవలీలగా విజయం సాధించింది.

వెబ్దునియా పై చదవండి