దేశవాళీ పోటీల్లో స్టార్ ఆటగాళ్లు: యూనిస్

దేశీయ టోర్నీల్లో స్టార్ ఆటగాళ్లు పాల్గొనాల్సిన అవసరం ఉందని పాకిస్థాన్ కెప్టెన్ యూనిస్ ఖాన్ పిలుపునిచ్చాడు. దీనివల్ల క్రికెట్ ఆట దేశంలో తిరిగి పుంజుకోగలదని ఆశాభావం వ్యక్తం చేశాడు. లాహోర్‌లో శ్రీలంక క్రికెటర్లపై ఉగ్రవాద దాడుల సంఘటనతో దేశంలో క్రికెట్ అడుగంటి పోరాదని వ్యాఖ్యానించాడు.

కరాచీలో విలేకరుల సమావేశంలో యూనిస్ మాట్లాడుతూ, లాహోర్ ఘటన తర్వాత క్రికెట్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలిందన్నాడు. ఈ సమయంలో దేశవాళీ పోటీల్లో స్టార్ ఆటగాళ్లు పాల్గొనాల్సిన కీలక సమయం ఇదేననిఅభిప్రాయపడ్డాడు. గత అనుభవాల దృష్ట్యా ప్రస్తుతం నేర్చుకోవలసింది చాలా ఉందని హబీబ్ బ్యాంక్ జట్టుకు సారథ్యం వహిస్తున్న యూనిస్ విశ్లేషించాడు.

అనేక మంది యువకులకు జీవిత లక్ష్యంగా ఉన్న క్రికెట్‌ను దేశంలో తెరమరుగు అవ్వకుండా అడ్డుకోవలసిన అవసరం ఉందన్నాడు. తనకు తెలిసి ప్రస్తత దేశీయ వన్డే పోటీలు ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లోను నిర్వహించడం విశేషంగా తెలిపాడు. ఇందులో ఆటగాళ్లు పూర్తి స్థాయిలో పాల్గొనడం ద్వారా పాక్‌లో క్రికెట్ బాగా ఉందనే సందేశాన్ని చాటి చెప్పాలని పిలుపునిచ్చాడు.

వెబ్దునియా పై చదవండి