ఐదు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా హామిల్టన్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న నాలుగో వన్డేలో భారత ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్, గౌతం గంభీర్‌లు వీరోచిత బ్యాటింగ్ ధాటికి న్యూజిలాండ్ బౌలింగ్ చతికిలబడింది. న్యూజిలాండ్ ఎంత మంది బౌలర్లను మార్చినా, చివరికి కెప్టెన్ వెటోరీ స్వయంగా రంగంలోకి దిగినా సెహ్వాగ్, గంభీర్ల జంటను విడగొట్టలేకపోయింది. సెహ్వాగ్ దూకుడుకు కళ్లెం వేయలేక అతని సిక్సర్ల ధాటికి కుదేలయింది.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లు ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 281 పరుగులను చేసింది.
అనంతరం వర్షం అంతరాయంగా ఉండటంతో అంపైర్లు ఓవర్లను కుదించారు. 43 ఓవర్లకు 263 పరుగుల లక్ష్యాన్ని భారత్‌కు నిర్దేశించారు. గుండెల నిండా చెరగని ఆత్మవిశ్వాసం పటిష్ట బ్యాటింగ్ లైనప్ ఉంటే లక్ష్యం ఎంతైతేనేం అనే ధోరణిలో బ్యాటింగ్‌కు దిగారు సెహ్వాగ్, గంభీర్‌లు.
ఆరంభంలో కొంత కుదురుకున్న తర్వాత సెహ్వాగ్ యధేచ్చగా షాట్లకు ఉపక్రమిస్తే.. గంభీర్ అతనికి తోడుగా నిలిచాడు. తన బ్యాటింగ్‌తో నలువైపులా మొహరించి ఉన్న ఫీల్డర్లను సెహ్వాగ్ పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో కేవలం 60 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు.
ఇందులో నాలుగు సిక్స్‌లు, 14 ఫోర్లు ఉన్నాయి. ఇదే సమయంలో ఆచితూచి ఆడుతు సెహ్వాగ్‌కు అండగా నిలిచిన గంభీర్ కూడా 53 బంతుల్లో అర్థసెంచరీ పూర్తి చేశాడు. గాయం కారణంగా నాలుగో వన్డేకు సచిన్ దూరమైన విషయం తెలిసిందే.