పొట్టి క్రికెట్ సమరంలో నేడు భారత్-ఆప్ఘనిస్తాన్‌ల ఢీ..!!

FILE
వెస్టిండీస్‌లోని కరేబియన్ దీవులలో జరుగుతున్న ట్వంటీ 20 ప్రపంచ కప్ సమరంలో నేడు టీం ఇండియా, ఆప్ఘనిస్తాన్ జట్లు హోరాహోరీ తలపడనున్నాయి. కాగా.. గ్రాస్ ఐలట్‌లోని బ్యూసేజర్ స్టేడియంలో జరిగే ఈ ఓపెనింగ్ మ్యాచ్‌లో తలపడుతున్న భారత్ ప్రపంచకప్ వేటను ప్రారంభిస్తోంది. జట్లపరంగా చూస్తే ధోనీ సేనకు ప్రత్యర్థి ఆప్ఘన్ ఏ విషయంలోనూ సరితూగదు. అయితే ఆప్ఘన్‌ను తక్కువగా అంచనా వేయకుండా భారత్ జాగ్రత్తపడాలి.

ఈ నేపథ్యంలో భారత కెప్టెన్, జార్ఖండ్ డైనమైట్ మహేంద్ర సింగ్ ధోనీ.. ఆప్ఘనిస్తాన్ జట్టును అంత తేలికగా తీసుకోవద్దని తన సహచరులకు ఇప్పటికే గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు కూడా. టీం ఇండియాలో ప్రముఖ ఆటగాడు యువరాజ్ సింగ్ సైతం ప్రత్యర్థి జట్టులోని ఎక్స్-ఫ్యాక్టర్స్‌పై ఇప్పటికే ఆందోళనలో ఉన్నాడు.

టీం ఇండియా బలంగా కనిపిస్తున్నా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అందుబాటులో లేనందున కాస్త ఇబ్బందిగానే కనిపిస్తోంది. అయితే వీరూ లేకపోయినా యువరాజ్ సింగ్, విజయ్, రోహిత్‌లలో ఏ ఇద్దరితో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం ఉంది. రైనా, యువరాజ్, ధోనీ, యూసుఫ్ పఠాన్‌లతో కూడిన మిడిలార్డర్ బలంగానే ఉంది. జహీర్, ప్రవీణ్, ఆశిష్ నెహ్రా, హర్భజన్ సింగ్, రవీంద్ర జడేజాలతో కూడిన బౌలింగ్ విభాగంకూడా పటిష్టంగానే ఉందని చెప్పవచ్చు. ఇక జట్టులోని సభ్యులంతా తాజాగా ఐపీఎల్-3లో ఆడినందున ఆ అనుభవంతో ఉత్తమంగా రాణించగలరనే క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇక ఆప్ఘన్ విషయానికి వస్తే... ఈ జట్టు బ్యాటింగ్ లైనప్ బాగానే ఉంది. ఓపెనర్ కరీమ్‌తోపాటు కెప్టెన్ నౌరౌజ్ మ్యాచ్‌ను మలుపుతిప్పే సామర్థ్యం కలిగినవారని చెప్పవచ్చు. అలాగే ఎక్కువమంది ఆల్‌రౌండర్లు ఉండటం ఈ జట్టుకు బలాన్నిచ్చే మరొక అంశం. బౌలింగ్‌లో పేసర్ దౌలత్, స్పిన్ ఆల్‌రౌండర్ నబిలు చెలరేగి ఆడగలరు. ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఐర్లండ్‌పై విజయం సాధించటం ఆప్ఘన్ ఆత్మ విశ్వాసాన్ని రెట్టింపు చేసిందనే చెప్పవచ్చు. రెండింట్లో ఒక్క మ్యాచ్‌నైనా గెలవాలనే గట్టి పట్టుదలతో బరిలో దిగుతోంది.

వెబ్దునియా పై చదవండి