బంగ్లాదేశ్‌పై డిఫెండింగ్ ఛాంపియన్ పాకిస్థాన్ గెలుపు!

FILE
వెస్టిండీస్‌ గడ్డపై జరుగుతున్న ఐసీసీ ట్వంటీ-20 ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌ పాకిస్థాన్ తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. గత ఏడాది ఐసీసీ ట్వంటీ-20 టైటిల్‌ను సొంతం చేసుకున్న పాకిస్థాన్, తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో బరిలోకి దిగింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 173 పరుగులు సాధించింది. పాక్ ఆటగాళ్లలో కమ్రాన్ అక్మల్ (73), సల్మాన్ భట్ (73) అద్భుత భాగస్వామ్యంతో జట్టు భారీ స్కోరును నమోదు చేసుకుంది. వీరిలో అక్మల్ 55 బంతుల్లో 8 బౌండరీలు, ఒక సిక్సర్‌తో 73 పరుగులు చేయగా, సల్మాన్ భట్ 46 బంతుల్లో 8 ఫోర్లు, రెండు సిక్సర్లతో 73 పరుగులతో అదరగొట్టారు.

అయితే పాకిస్థాన్ నిర్ధేశించిన భారీ లక్ష్యాన్ని క్రమంలో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 151 పరుగులకే కుప్పకూలింది. బంగ్లా బ్యాట్స్‌మెన్లలో అశ్రాఫుల్ 65, అల్ హాసన్ 47 పరుగులతో పర్వాలేదనిపించినా, మిగిలిన బ్యాట్స్‌మెన్లు పెవిలియన్ దారి పట్టడంతో బంగ్లాదేశ్‌కు ఓటమి తప్పలేదు.

ఇక పాకిస్థాన్ బౌలర్లలో సమీ మూడు, అమీర్ రెండు వికెట్లు తీసుకున్నారు. అలాగే హఫీజ్, అజ్మల్‌లు చెరో వికెట్ పడగొట్టారు. అలాగే బంగ్లాదేశ్ బౌలర్లలో షాకిబ్ అల్ హసన్ రెండు వికెట్లు పడగొట్టగా, షఫియుల్ ఇస్లామ్ ఒక వికెట్ సాధించాడు. కాగా.. క్రీజులో విజృంభించి ఆడిన సల్మాన్ భట్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

వెబ్దునియా పై చదవండి