బిలియన్ డాలర్ల ఆదాయం ఆర్జించనున్న ఐపీఎల్: మోడీ

బుధవారం, 24 మార్చి 2010 (17:25 IST)
ఇప్పటికే ధన క్రీడగా పేరుగాంచిన ఇండియన్ ప్రీమియర్ లీగ్.. నిజంగానే కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్-3 ద్వారా బిలియన్ డాలర్ల ఆదాయం వస్తుందని ఐపీఎల్ కమిషనర్ లలిత్ మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. దీనిపై ఆయన న్యూఢిల్లీలో మాట్లాడుతూ ఈ సీజన్‌లో ఐపీఎల్ ఒక బిలియన్ మేర ఆదాయాన్ని తెచ్చిపెడుతుందన్నారు.

దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ క్రీడకు లభిస్తున్న ఆదరణే ఇందుకు కారణమన్నారు. భారీగా అడ్వర్‌టైజ్‌మెంట్లను ఆకర్షించడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. ఈ టోర్నీ మొత్తం పూర్తయ్యే సరికి ఖచ్చితంగా ఒక బిలియన్ డాలర్ల (సుమారు 4,700 కోట్ల రూపాయలు) కంటే ఎక్కువ ఆదాయం వస్తుందన్నారు.

ఆదాయం పెరగడం వల్ల లీగ్ బ్రాండ్ విలువ కూడా పెరుగుతుందన్నారు. అధికార ప్రసార హక్కులు కలిగిన సోని సంస్థ మాత్రమే సుమారు 700 కోట్ల నుంచి 800 కోట్ల రూపాయల మేరకు ఆదాయం ఆర్జించనుంది. అయితే, సీజన్-3లో అడ్వర్‌టైజ్‌మెంట్ రేట్లు అధికంగా ఉన్నట్టు వచ్చిన విమర్శలను లలిత్ మోడీ తోసిపుచ్చారు. తాము ప్రకటించిన రేట్లను చూసి కొందరు తప్పుకోవచ్చు. కానీ, అనేక మంది ముందుకు వచ్చారని ఆయన గుర్తు చేశారు.

వెబ్దునియా పై చదవండి