కోచ్చి ఫ్రాంఛైజీ వ్యవహారంలో మాజీ కేంద్ర మంత్రి శశి థరూర్ స్నేహితురాలుగా వెలుగులోకి వచ్చిన సునంద పుష్కర్ లలిత్ మోడీపై విమర్శల బాణాలు సంధిస్తూనే ఉన్నారు. తాజాగా ఆమె మోడీపై మరో బాంబు పేల్చారు. అదేమిటంటే... ఐపీఎల్ మోడళ్లతో లలిత్ మోడీ ప్రవర్తన.
ఐపీఎల్ మోడల్ అమ్మాయిల పట్ల లలిత్ మోడీ ప్రవర్తన అభ్యంతరకరంగా ఉండటాన్ని తాను చాలాసార్లు గమనించానని సునంద పుష్కర్ ఫేస్‌బుక్‌లో రాసుకుంది. ఆ విషయంలో ప్రపంచంలోనే అతడు నెంబర్ వన్ అని తీవ్రమైన విమర్శలు చేసింది.
లలిత్ మోడీ ట్విట్టర్ ద్వారా బీసీసీఐకి ముచ్చెమటలు పట్టిస్తుంటే సునంద పుష్కర్ మాత్రం ఫేస్‌బుక్ ద్వారా మోడీకి షాక్ మీద షాక్ ఇచ్చే పని పెట్టుకుంది. అంతకుముందు మోడీకి దావుద్ ఇబ్రహీంతో సంబంధాలున్నాయని సంచలన ప్రకటన చేసిన సునంద తాజాగా అమ్మాయిల వ్యవహారాన్ని తెరమీదికి తెచ్చింది.
అసలు ఐపీఎల్ మ్యాచ్‌లు దావూద్ ఇబ్రహీం కనుసన్నల్లో జరుగుతున్నాయని ఆరోపించింది. ఐపీఎల్ టోర్నీల్లో ఆర్జించిన లాభాలు దావూద్ అకౌంట్‌లో నేరుగా జమ అయిపోతున్నాయనీ, ఐపీఎల్ టోర్నీల కోసం దావూద్ ఇబ్రహీం లక్ష కోట్ల రూపాయలను పెట్టుబడి పెట్టాడని ప్రకటన చేసింది. అదేవిధంగా ప్రతి ఫ్రాంఛైజీలోనూ "డి" కంపెనీకి వాటాలున్నాయని ఆరోపించింది.