కరేబియన్ గడ్డపై జరుగుతున్న ఐసీసీ ట్వంటీ-20 ప్రపంచ కప్‌లో టీమ్ ఇండియా వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. బ్యాట్స్‌మెన్స్ సురేష్ రైనా శివమెత్తి సెంచరీతో కదంతొక్కడంతో భారత జట్టు 14 పరుగుల తేడాతో విజయం సాధించి, సూపర్-8కు దూసుకెళ్ళింది.
ఈ టోర్నీలో భాగంగా ఆదివారం ఇక్కడి బిసేజర్ స్టేడియంలో పటిష్టమైన దక్షిణాఫ్రికా జట్టుతో కీలక మ్యాచ్ జరిగింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ధోనీ సేన నిర్ణీత 20 ఓవర్లలో 186 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన దినేష్ కార్తీక్ (16), మురళీ విజయ్ (0)లు మంచి శుభారంభాన్ని ఇవ్వలేక పోయారు.
తొలి వికెట్ నాలుగు పరుగుల వద్ద పడిపోయింది. ఆ తర్వాత రెండో వికెట్ రూపంలో దినేష్ కార్తీక్ పెవిలియన్‌కు చేరాడు. ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన సురేష్ రైనాతో యువరాజ్ సింగ్ జత కలిసి జట్టు స్కోరును పెంచారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 88 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో యువరాజ్ (37), రైనా (101) పరుగులు చేయగా, యూసఫ్ పఠాన్ (11), ధోనీ (16) పరుగుల చొప్పున చేశారు. సురేష్ రైనా కేవలం 60 బంతుల్లో తొమ్మిది ఫోర్లు, ఐదు సిక్సర్లతో సఫారీ బౌలర్లపై విరుచుకు పడ్డారు. దీంతో భారత్ భారీ స్కోరు చేసింది.
అనంతరం 187 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీలు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి కేవలం 172 పరుగులు మాత్రమే చేసింది. దక్షిణాఫ్రికా జట్టులో స్మిత్ (36), కల్లీస్ (73), డీ విలియర్స్ (31)లు మాత్రమే రాణించారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సురేష్ రైనా అందుకున్నాడు.