పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌కు వివాదాల ఉచ్చు క్రమేణా బిగుసుకుంటుంది. భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను పెళ్లాడుతానంటూ.. పాక్ నుంచి హైదరాబాద్ వచ్చిన షోయబ్ మాలిక్‌పై అతడి తొలి భార్యగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయేషా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇందులో మాలిక్ తనను పెళ్లి చేసుకుని మోసం చేశాడని పేర్కొంది.
ఇంకా లావుగా ఉన్నానని తనను వేధించాడని, వరకట్నం కోరాడని తెలిపింది. షోయబ్‌తో తన వివాహానికి సంబంధించిన పూర్తి ఆధారాలను పోలీసులకు అందజేసింది. ఇంకా 2002లో షోయబ్‌తో తన పెళ్లి జరిగిందని, పాక్ రెసిడెన్సీ హోటల్లో అతనితో మూడు రోజులు గడిపానని చెప్పింది.
కాగా.. షోయబ్- ఆయేషాల సంబంధంపై ఆయేషా డాక్టర్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆయేషా పూర్తి ఒత్తిడిలో ఉందని, అందుకే మీడియా ముందుకు రాలేదని చెప్పారు. సరైన సమయంలో ఆయేషా మీడియా ముందుకు వస్తుందని డాక్టర్ వెల్లడించారు. ఆయేషాను మాలిక్ మానసికంగా వేధించాడని వెల్లడించారు. ప్రస్తుతానికి షోయబ్ మాలిక్ బహిరంగంగా క్షమాపణలు చెబుతూ.. తనకు విడాకులు ఇవ్వాల్సిందిగా ఆయేషా కోరుతుందని డాక్టర్ అన్నారు.
మరోవైపు.. ఆయేషా షోయబ్‌తో కొంత కాలం గడిపినందుకుగాను తను గర్భవతినయ్యాయనీ ఓ దినపత్రికకు ఇచ్చిన ఫోన్ ఇంటర్య్వూలో తెలిపినట్లు సమాచారం. దీంతో షోయబ్ మాలిక్ - అయేషా - సానియాల వ్యవహారం కొత్త మలుపు తిరిగింది.
ఇదిలావుంటే షోయబ్ మాలిక్‌పై బంజారాహిల్స్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడమే కాక సానియా ఇంట్లో ఉన్న షోయబ్‌ను సుమారు గంటన్నరపాటు విచారించారు. మరోవైపు అతడు నగరం విడిచి వెళ్లకుండా ఉండేందుకుగాను అతడి పాస్‌పోర్టును, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
కాగా.. ఆయేషా ఫిర్యాదు మేరకు బంజారా హిల్స్ పోలీసులు పాస్‌పోర్టును స్వాధీనం చేసుకోవడంపై షోయబ్ మాలిక్ మండిపడుతున్నాడు. పాస్‌పోర్టు స్వాధీనంపై పాకిస్థాన్ రాయబార కేంద్రానికి ఫిర్యాదు చేస్తానని మాలిక్ అంటున్నాడు. కానీ ఆయేషా ఫిర్యాదుతో షోయబ్ మాలిక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి.