హామిల్టన్ వన్డే: అడ్డంకిగా నిలిచిన వర్షం

బుధవారం, 11 మార్చి 2009 (10:27 IST)
చక్కటి ఆరంభాన్నిచ్చిన న్యూజిలాండ్ అనూహ్యంగా ఇషాంత్ శర్మా విజృంభణతో ఒక్కసారిగా వెనక అడుగు వేసింది. ఇంతలో వర్షం రావడంతో కాసేపు ఆటకు అంతరాయం ఏర్పడింది. అప్పటికే 209 పరుగులకు న్యూజిలాండ్ 5వికెట్లను నష్టపోయింది.

అంతకుముందు.. న్యూజిలాండ్ ఓపెనర్లు రైడర్, మెక్‌కల్లుమ్‌‌లు ధాటిగా బ్యాటింగ్ ప్రారంభించారు. వీరిద్దరీ భాగస్వామ్యాన్ని విడగొట్టడానికి భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వరసగా బౌలర్లను మార్చినా ఫలితం లేకపోయింది. వీరిద్దరు 115 బంతుల్లో వంద పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

ఈ తరుణంలో బౌలింగ్‌కు దిగిన యువరాజ్.. రైడర్‌ను 46 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌కు పంపడం ద్వారా వీరి భాగస్వామ్యాన్ని విడగొట్టాడు. కొద్దిసేపటికే మెక్‌కల్లుమా కూడా (77) జహీర్‌ఖాన్ వేసిన చక్కటి బంతికి ఎల్బిడబ్ల్యూ రూపంలో వెనుదిరిగాడు.

ఆ తర్వాత టేలర్ (5) నిలదొక్కుకున్నట్లే కనిపించినా యూసుఫ్ పఠాన్ బౌలింగ్‌లో శర్మా చేతికి చిక్కాడు. ఒక్కసారిగా మూడు వికెట్లను వరుసగా కోల్పోయిన న్యూజిలాండ్ కష్టాల్లో పడింది. జట్టు బాధ్యతను భుజస్కందాలపై వేసుకున్న గుప్తిల్ క్రీజులో నిలబడేందుకు ప్రయత్నించాడు. ఈలోగా ఓరమ్ (1) శర్మా బౌలంగులో ధోనీకి క్యాచ్ ఇచ్చాడు.

ఆ తర్వాత వచ్చిన మెక్‌గ్లాషన్.. గుప్తిల్‌కు అండగా నిలిచాడు. క్రీజులో పాతుకుపోతున్న ఈ జంటను శర్మా విడగొట్టాడు. గుప్తిల్ 25 పరుగుల స్కోరు వద్ద.. శర్మా బౌలింగులో సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా వచ్చిన కార్తీక్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరుకున్నాడు.

ఆ తర్వాత ఎలియోట్, మెక్‌గ్లాషన్‌లు క్రీజులో ఉండగా.. వర్షం పడటంతో కాసేపు మ్యాచ్ నిలిపేశారు. కాగా, ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌లో భారత బౌలర్లు ఇషాంత్ శర్మా 2, జహీర్ ఖాన్ 1, యూసుఫ్ పఠాన్ 1 వికెట్లు తీసుకున్నారు.

వెబ్దునియా పై చదవండి