హామిల్టన్ వన్డేకు సచిన్ టెండూల్కర్ దూరం

మంగళవారం, 10 మార్చి 2009 (12:39 IST)
FileFILE
మూడో వన్డేలో సెంచరీతో న్యూజిలాండ్ బౌలర్లకు చెమటలు పట్టించిన టీం ఇండియా మాస్టర్ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ పొత్తికడుపు గాయం కారణంగా హామిల్టన్‌లో జరిగే నాలుగో వన్డే మ్యాచ్‌కు దూరమయ్యాడు. అయితే ఐదో వన్డేకు సచిన్ అందుబాటులో ఉండనున్నాడు.

వెల్లింగ్టన్‌లో జరిగే రెండో వన్డే సందర్భంగా ఇయాన్ ఓ బ్రయాన్ బౌలింగ్‌లో సచిన్ గాయపడ్డాడు. ఈ గాయం కారణంగానే అనంతరం జరిగిన మూడో వన్డేలో 163 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. సోమవారం క్రైస్ట్‌చర్చ్ ఆస్పత్రిలో సచిన్ గాయానికి ఎంఆర్ఐ స్కాన్ తీశారు.

పొత్తికడుపులో రక్తస్రావం జరిగిన ఆనవాళ్లు బయటపడటంతో, బుధవారం హామిల్టన్‌లో ఆతిథ్య దేశంతో జరిగే నాలుగో వన్డేకు సచిన్ టెండూల్కర్ దూరమయ్యాడు. కడుపులో రక్తస్రావం జరిగిన ఆనవాళ్లు బయటపడ్డాయి. అయితే మరో రెండు రోజుల్లో ఆడేందుకు సిద్ధమవతానని ఎంఆర్ఐ స్కాన్ అనంతరం సచిన్ చెప్పాడు.

ఫామ్‌లో ఉన్నప్పుడు మ్యాచ్‌కు దూరం కావడం బాధాకరమని వ్యాఖ్యానించాడు. ప్రస్తుత వన్డే సిరీస్‌లో సచిన్ మంచి ఫామ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. తొలి వన్డేలో 20 పరుగులకే వెనుదిరిగిన సచిన్, తరువాత జరిగిన రెండో వన్డేలో 61 పరుగులు చేశాడు. మూడో వన్డేలో 163 పరుగులు చేయడం ద్వారా సిరీస్‌లో ఇప్పటివరకు సచిన్ మొత్తం 244 పరుగులు తన ఖాతాలో వేసుకున్నాడు.

వెబ్దునియా పై చదవండి