హీరోహోండా సిరీస్‌లో భాగంగా కాన్పూర్‌లో జరుగుతున్న మూడో వన్డేలో ఇంగ్లాండ్ జట్టు భారత ముంగిట 241 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్లకు భారత స్పిన్నర్లు అడ్డుకట్ట వేశారు. దీంతో ఇంగ్లాండ్ ఆటగాళ్లలో ఏ ఒక్కరూ భారీ స్కోరు చేయలేక పోయారు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన బొపరా(60) ఒక్కరే అర్థశతకాన్ని పూర్తి చేయడం గమనార్హం.
మరో ఓపెనర్ బెల్ (46) ఒ.ఎ.షా (40), పీటర్సన్ (13), కాలింగ్‌వుడ్ (1), పటేల్ (26), ఫ్లింటాఫ్ (26)లు భారత స్లో బౌలర్ల మాయాజాలంలో పడి వికెట్లను సమర్పించుకున్నారు. దీంతో ఇంగ్లాండ్ నిర్ణీత 48.4 ఓవర్లలో అన్ని వికెట్లను కోల్పోయి 240 పరుగులు మాత్రమే చేసింది. పరుగుల వరద పారే కాన్పూర్ పిచ్‌పై ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్స్ ఎవరూ కూడా పెద్దగా రాణించలేక పోయారు.
కాగా, భారత బౌలర్లలో స్పిన్ మాంత్రికుడు హర్భజన్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టాడు. మునాఫ్ పటేల్ రెండు, ఇషాంత్ శర్మ రెండు వికెట్లు సాధించారు. యూసఫ్ పఠాన్, జహీర్ ఖాన్, యువరాజ్ సింగ్‌లు ఒక్కో వికెట్ చొప్పున తీశారు.