గంగూలీ సెంచరీ : భారత్ స్కోరు 442/7

శనివారం, 18 అక్టోబరు 2008 (12:55 IST)
మొహాలీలో ఆస్ట్రేలియాతో జరుగుతోన్న రెండో టెస్ట్‌లో సౌరవ్ గంగూలీ సెంచరీ సాధించాడు. గంగూలీకి తోడు కెప్టెన్ ధోనీ సైతం అర్థ సెంచరీ సాధించడంతో భారత్ స్కోరు 400 దాటింది. వీరిద్దరి చక్కని భాగస్వామ్యంతో ప్రస్తుతం భారత్ ఏడు వికెట్ల నష్టానికి 442 పరుగుల వద్ద కొనసాగుతోంది. హర్భజన్ (0), ధోనీ (67)లు క్రీజులో ఉన్నారు. సెంచరీ సాధించిన తరుణంలో వైట్ బౌలింగ్‌లో గంగూలీ (102) ఔట్ అయ్యాడు.

ఓవర్‌నైట్ స్కోరు ఐదు వికెట్ల నష్టానికి 311 పరుగులతో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్ 15 పరుగులు జోడించి ఇషాంత్ శర్మ (9) వికెట్‌ను కోల్పోయింది. ఇషాంత్‌శర్మ వికెట్‌ను సిడిల్ దక్కించుకున్నాడు. దీంతో ఆస్ట్రేలియా బౌలర్లలో జాన్సన్ ఖాతాలో మూడు, సిడిల్ ఖాతాలో రెండు వికెట్లు చేరగా వైట్, బ్రెట్‌లీ ఖాతాలో చెరో వికెట్ చేరింది.

అంతకుముందు ఈ మ్యాచ్‌లో తొలిరోజు టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే. ఓపెనర్ల శుభారంభానికి తోడు సచిన్ (88) విజృంభించడంతో తొలిరోజు భారత్ భారీస్కోరు దిశగా పయనించింది. తొలిరోజు ఆటలో సచిన్ అత్యధిక టెస్ట్ పరుగుల ప్రపంచ రికార్డును సాధించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా సచిన్ 12000 పరుగుల మైలురాయిని సైతం అధిగమించాడు. సచిన్‌తో పాటు గంగూలీ సైతం టెస్టుల్లో 7000 పరుగుల మైలు రాయిని చేరుకోవడం తొలిరోజు మ్యాచ్‌లో విశేషం

వెబ్దునియా పై చదవండి