నాగ్‌పూర్ టెస్ట్: నిలకడగా రాణిస్తున్న ఓపెనర్లు

ప్రతిష్టాత్మక ఆస్ట్రేలియా జట్టుతో జరుగుతున్న ఆఖరి టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో భారత ఓపెనర్లు నిలకడగా రాణిస్తున్నారు. ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 59, విజయ్ 37 పరుగులతో రాణిస్తున్నారు. దీంతో మ్యాచ్ నాలుగో రోజు తొలి సెషన్స్‌కు భారత్ వికెట్ నష్టపోకుండా 98 పరుగులు చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 86 పరుగుల ఆధిక్యంతో కలుపుకుని మొత్తం 184 పరుగుల ఆధిక్యం లభించింది.

అంతకుముందు భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 441 పరుగులకు ఆలౌట్ కాగా, ఆస్ట్రేలియా జట్టు 355 పరుగులు చేసింది. భారత జట్టులో సచిన్ 109 పరుగులు చేయగా, ఆసీస్ జట్టులో ఓపెనర్ కటిచ్ 102 పరుగులు చేసిన విషయం తెల్సిందే. కాగా, మూడో రోజు ఆస్ట్రేలియా జట్టు 355 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్.. కేవలం ఒక ఓవర్ మాత్రమే ఆడింది. పరుగులు ఏమీ చేయలేదు.

నాలుగో రోజు ఉదయం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు ఓపెనర్లు ఆచితూచి ఆడుతూ స్కోరు వేగాన్ని పెంచారు. సెహ్వాగ్ ఫోర్లతో ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ఆ క్రమంలో 76 బంతుల్లో ఆరు ఫోర్లతో అర్థ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అలాగే విజయ్ కూడా 37 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. దీంతో లంచ్ సమయానికి భారత్ 98 పరుగులు చేసింది.

వెబ్దునియా పై చదవండి