పటిష్టమైన బౌలింగ్ లేకనే అపజయం : ధోనీ

టీం ఇండియా బౌలింగ్ పటిష్టవంతంగా లేకపోవడం వల్లనే టీం ఇండియా అపజయం పాలయ్యిందని... కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వాపోయాడు. జట్టులోని సీనియర్ బౌలర్లకు విశ్రాంతినివ్వడంతో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని... అయితే సిరీస్ గెల్చుకోవడంతో సంతోషంగా ఉందని ధోనీ అన్నాడు.

లంక-భారత్‌ల నడుమ ఆదివారం జరిగిన ఐదో వన్డేలో అపజయం అనంతరం ధోనీ మీడియాతో మాట్లాడుతూ... పేస్ బౌలర్ జహీర్ ఖాన్, స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా, బ్యాటింగ్ మాస్టర్ సచిన్ టెండూల్కర్‌లకు విశ్రాంతి ఇవ్వడం వల్ల.. లంక బ్యాట్స్‌మెన్‌లను కట్టడి చేయలేకపోయామని పేర్కొన్నాడు.

అయితే బౌలింగ్ బలంగా లేకపోవడం వాస్తవం అయినప్పటికీ... ఇప్పటిదాకా ఆడని రవీంద్ర జడేజా లాంటి ఆటగాడిని ఈ మ్యాచ్‌లో ఆడించటం అవసరమైందని, ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్ అంటే ఏంటో జడేజా రుచి చూసినట్లైంది కదా...! అని ధోనీ చెప్పాడు.

ఆ విషయాన్నలా పక్కన ఉంచితే... లంక సిరీస్ విజయాన్ని జట్టు సహచరులకే అంకితం చేస్తున్నట్లు ధోనీ వెల్లడించాడు. "తామందరం ఒకరి విజయాన్ని, మరొకరం ఆస్వాదిస్తామనీ.. నీ అవసరం ఉందని ఏ ఆటగాడిని పిలిచినా, వెంటనే రాణించి చూపిస్తున్నాడు. మ్యాచ్ ఓడినప్పటికీ... సిరీస్ గెలిచాం, మరిన్ని టోర్నీలలో ఇలాంటి విజయాలను సాధిస్తామని" ధోనీ అన్నాడు.

ఇదిలా ఉంటే... తాను వరుసగా రెండో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డును పొందేందుకు కారణమైన సచిన్ టెండూల్కర్‌కు యువరాజ్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశాడు. అంతేగాకుండా, సచిన్‌తోపాటు తనకు తోడ్పడిన శిక్షణా సిబ్బందికి కూడా యూవీ థ్యాంక్స్ చెప్పుకున్నాడు.

భారత్ సిరీస్ కైవసం చేసుకున్న సంగతి గురించి లంక కెప్టెన్ జయవర్ధనే మాట్లాడుతూ... ఈ సిరీస్ విజయానికి భారత్ పూర్తి అర్హత కలిగి ఉందని, తమకన్నా టీం ఇండియా చాలా మెరుగ్గా ఆడిందని మెచ్చుకున్నాడు. నాలుగు వరుస వన్డేలలో ఓడిపోవడం నిరాశ కల్పించినా, పాక్‌ సిరీస్‌కు ముందు మంచి విజయం లభించిందని, తమ జట్టులో గెలవాలన్న తపన ఉందని, అందరూ బాగా ఆడారని ఆయన సంతోషం వ్యక్తం చేశాడు.

వెబ్దునియా పై చదవండి