పటిష్ట స్థితిలో ఆస్ట్రేలియా: 338/4

ఢిల్లీలో జరుగుతున్న మూడో టెస్ట్ మూడో రోజు ఆట రసవత్తరంగా మారింది. ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 4 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది. క్రీజులో మైఖేల్ క్లార్క్ (21), వాట్సన్ (4)లు ఉన్నారు. మూడో రోజు ఆటలో అసీస్ బ్యాట్స్‌మెన్‌లను కట్టడి చేయడంలో భారత్‌ బౌలర్లు విఫలమయ్యారు.

భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 613 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ధీటుగా స్పందించిన ఆస్ట్రేలియా ఆరంభం నుంచే భారత బౌలర్లపై దాడికి దిగింది. మూడో రోజు ఉదయం స్పిన్ తిరుగుతుందని భావించిన భారత్‌కు కాస్తంత నిరాశే ఎదురైందని చెప్పాలి.

మధ్యాహ్నం భోజన విరామ సమయానికి ముందు కటిచ్‌ (64) ఔటయ్యాడు. మిశ్రా వేసిన బంతిని ఆడబోయి బౌల్డ్ అయ్యాడు. కానీ ఆ తర్వాత వికెట్లు పడటమే కష్టమయింది.

రికీ పాంటింగ్, హస్సీలు ఆచితూచి ఆడుతూ అడపాదడపా ఫోర్లు కొడుతూ ప్రమాదకరంగా మారారు. దీంతో మళ్లీ రంగంలోకి సెహ్వాగ్‌ బౌలింగ్‌‌కు దిగి రికీ పాంటింగ్‌ (87)ను వెనక్కి పంపాడు. మరి కొద్ది సేపటికి హస్సీను (53) కూడా పెవిలియన్ దారి పట్టించాడు.

వెబ్దునియా పై చదవండి