భారీ స్కోరుతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన భారత్

రాజ్‌పూట్ వన్డేలో భారత్ భారీ స్కోరుతో ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించింది. భారత్ ముందుంచిన 387 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ చేధించలేకపోయింది. దీంతో నిర్ణీత 37.4 ఓవర్లలో ఇంగ్లండ్ 9 వికెట్లు కోల్పోయి, 229 పరుగులు మాత్రమే చేయగలిగింది. ప్రత్యర్థిపై భారత్ బౌలర్లు సాధించిన పట్టుతో భారత్ అజేయ విజయాన్ని నమోదు చేసుకుంది.

ఓపెనర్లుగా బరిలోకి దిగిన బెల్‌.. జహీర్ బౌలింగ్‌లో 25 పరుగులు మాత్రమే చేసి ధోనీకి వికెట్‌ సమర్పించుకున్నాడు. ఆ తర్వాత ఎం ప్రియర్ (4)మునాఫ్ బౌలింగ్‌‍లోనూ, షా జహీర్‌ బౌలింగ్‌లో డకౌట్ అయ్యాడు. మొత్తానికి... ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్స్ పెద్దగా రాణించలేక పోయారు. ఇంగ్లండ్ కెప్టెన్ కె.పి. పీటర్సన్ మాత్రం ఏడు బౌండ్రీలతో అర్థసెంచరీ దాటి, 63 పరుగులు చేసి రోహిత్ శర్మ రనౌట్ చేయడంతో అవుట్ అయ్యాడు.

అదేవిధంగా ఆర్.ఎస్. బొపారా 38 బంతుల్లో, రెండు ఫోర్లతో అర్థసెంచరీ దాటి (54 పరుగులు) చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఒక్క ఫోర్‌కే పరిమితమైన ఫ్లింటాఫ్, ఎస్.ఆర్. పటేల్‌ (28 పరుగులు)‌లు భజ్జీ బౌలింగ్‌లో ధోనీకి క్యాచ్ ఇచ్చారు. అదేవిధంగా... బ్రాడ్ (26 పరుగులు) చేసి సెహ్వాగ్ బౌలింగ్‌లో గంభీర్ క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. హార్మిసన్ రనౌట్ కాగా, ఆండర్సన్‌ యూసఫ్ పఠాన్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు.

ఇకపోతే... భారత బౌలర్లలో జహీర్ ఖాన్ మూడు వికెట్లు పడగొట్టగా, మునాఫ్ పటేల్, ఆర్పీ సింగ్, పఠాన్, వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్ తలా ఒక్కొ వికెట్ చొప్పున తీశారు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన భారత్ ఓపెనర్లు.. ఫోర్లతో స్టేడియాన్ని హోరెత్తించారు. సునామీలా రెచ్చిపోయిన యువరాజ్‌ సింగ్‌‍ తన కెరీర్‌లో తొమ్మిదో సెంచరీ పూర్తి చేసుకోవడమే కాకుండా.. కేవలం 78 బంతుల్లోనే 16 ఫోర్లు, ఆరు సిక్స్‌లతో 138 పరుగులు సాధించి, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఆవార్డును సొంతం చేసుకున్నాడు.

భారత బ్యాట్స్‌మెన్లలో వీరేంద్ర సెహ్వాగ్ (81 పరుగులు), గౌతమ్ గంభీర్ (51 పరుగులు), రైనా (43 పరుగులు), కెప్టెన్ ధోని (39 పరుగులు), ఇషాంత్ శర్మ (11 పరుగులు) చేశారు. అయితే పఠాన్ ఒక్క పరుగు కూడా చేయక బెల్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. కాగా, ఏడు వన్డేల సిరీస్‌లో భాత్ 1-0 తేడాతో ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది.

వెబ్దునియా పై చదవండి