ప్రతి మ్యాచ్‌లోనూ ధోనీ సలహాలు తీసుకోవడం అంటే అతడిపై ఆధారపడుతున్నానని అర్థం కాదని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. దక్షిణాఫ్రికాతో కీలక మ్యాచ్‌లో కూడా చాలాసార్లు ధోనీని సంప్రదించాకే కోహ్లీ ఫీల్డింగ్‌ను సెట్ చేశాడు, బౌలర్లకు బంతి ఇచ్చాడు. అనుభవజ్ఞుడైన ధోనీ నుంచి సూచనలు తీసుకోవడం జట్టు ప్రయోజనాలకు అవసరమే కానీ ఇది నా వ్యక్తిగత వ్యవహారం కాదని కోహ్లి సమర్థించుకున్నాడు.
‘మేం అవకాశాలను చాలా బాగా ఒడిసిపట్టుకున్నాం. అందువల్లే అంత బలమైన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ లైనఫ్‌ను 190 పరుగులకు పరిమితం చేయగలిగాం. ఏబీ డివిలియర్స్ త్వరగా ఔట్ చేయడం మంచిదైంది. అతను మిడిల్ ఓవర్లలో ప్రత్యర్థిని దెబ్బతీయగలడు. అతన్ని ఔట్ చేయడం మ్యాచ్‌లో మాకు గొప్ప మలుపు. జట్టు సభ్యులు అంత తీవ్రత పెట్టి ఆడటం ఎంతో బాగుంది’ అని కోహ్లి వివరించాడు.