గవాస్కర్ - బోర్డర్ సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో గెలుచుకుంది. క్రికెట్ ప్రపంచంలో అనధికారిక టెస్ట్ ఛాంపియన్‌గా కొనసాగుతున్న ఆస్ట్రేలియా జట్టుపై భారత క్రికెట్ జట్టు మరోమారు పైచేయి సాధించింది. భారత గడ్డపై టెస్ట్ సిరీస్ కైవసం చేసుకోవాలనే కృతనిశ్చయంతో ఇక్కడకు వచ్చిన రికీ సేనకు ధోనీ సేన గట్టి సమాధానం చెప్పింది.
ఈ టెస్ట్ సిరీస్‌కు అనిల్ కుంబ్లేను అధికారిక టెస్ట్ కెప్టెన్‌గా ప్రకటించినప్పిటకీ.. ధోనీ నేతృత్వంలోని "టీమ్ ఇండియా" సమిష్టి విజయం సాధించింది. కుంబ్లే గాయంతో మొహాలీ టెస్ట్‌కు ధోనీ తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టి.. 320 పరుగుల ఆధిక్యంతో విజయాన్ని సమకూర్చి పెట్టాడు.
దీంతో భారత్ 1-0 ఆధిక్యాన్ని కూడబెట్టుకుంది. ఢిల్లీలో జరిగిన మూడో టెస్ట్ అనంతరం కుంబ్లే అంతర్జాతీయ క్రికెట్‌కు స్వస్తి చెప్పాడు. దీంతో నాగ్‌పూర్ టెస్ట్‌కు ధోనీని పూర్తిస్థాయి కెప్టెన్‌గా బీసీసీఐ ప్రకటించింది. ఈ టెస్టులోనూ భారత జట్టు 172 పరుగుల తేడాతో విజయం సాధించి, సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుని కంగారుల అధిపత్యానికి మరో గండికొట్టింది.
టాస్ గెలిచిన ధోనీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత ఓపెనర్లు మంచి శుభారంభాన్నిఇచ్చారు. తొలి, రెండు ఇన్నింగ్స్‌లలో రమారమి వంద పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ఆరంభంలో జట్టుకు గట్టి పునాది వేశారు. ఆ తర్వాత సచిన్ టెండూల్కర్ సెంచరీ, లక్ష్మణ్, గంగూలీ, ధోనీల బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 441 పరుగులు చేసింది.
పిమ్మట ఆసీస్ ఇన్నింగ్స్ ప్రారంభంకాగా, ఆ జట్టును భారత బౌలర్లు 355 పరుగులకే కట్టడి చేశారు. ఓపెనర్ కటిచ్, హుస్సేల పోరాట పటిమతో ఆసీస్ ఆమాత్రం స్కోరు చేయగలిగింది. ఏదిఏమైనా.. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో కీలకమైన 86 పరుగుల ఆధిక్యాన్ని కూడబెట్టుకుంది. ఆ తర్వాత భారత రెండో ఇన్నింగ్స్ ఆటుపోటులా సాగింది.
తొలుత సెహ్వాగ్, విజయ్ బ్యాటింగ్ విన్యాసం కొనసాగింది. రెండో సెషన్లో ఆసీస్ బౌలర్ల పూర్తి ఆధిపత్యం. ఒక్క సెషన్లోనే పరిస్థితంతా తారుమారు. మ్యాచ్‌పై పట్టు కోల్పోయిన భారత్. కానీ అంతలోనే ధోనీ, భజ్జీల సమయోచిత భాగస్వామంతో భారత్ ఇన్నింగ్స్ కుదుటపడి, 295 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో మొత్తం 382 పరుగుల భారీ ఆధిక్యాన్ని మూటగట్టుకుంది.
అనంతరం భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌ను భారత బౌలర్లందరూ సమిష్టిగా రాణించి పూర్తిగా కట్టిడి చేశారు. దీంతో ఆస్ట్రేలియా కేవలం 209 పరుగులకే ఆలౌట్ అయింది. హర్భజన్ సింగ్ నాలుగు, అమిత్ మిశ్రా మూడు, ఇషాంత్ శర్మ రెండు చొప్పున వికెట్లను తీసి కంగారుల వెన్నువిరిశారు.
ఆసీస్ వికెట్లన్నీ టప..టపా.. అంతకుముందు నాలుగో రోజు ఓవర్ నైట్ స్కోరు 13 పరుగులతో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్.. తన తొలి వికెట్‌ను 29 పరుగుల వద్ద కోల్పోయింది. ఓపెనర్ కటిచ్ (16) ఇషాంత్ బౌలింగ్‌లో ధోనీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రమం తప్పకుండా వికెట్లను కోల్పోయింది.
రెండో వికెట్ 37 (రికీ పాటింగ్) పరుగుల వద్ద, మూడో వికెట్ 82 (క్లార్క్), నాలుగో వికెట్ 150 (హుస్సే) పరుగుల వద్ద, ఐదో వికెట్ 154 (హెడెన్), ఆరో వికెట్ 161 (హ్యాడ్డిన్) ఏడో వికెట్ 178 (వాట్సన్) ఎనిమిదో వికెట్ 190 (క్రేజా), తొమ్మిదో వికెట్ 191 (బ్రెట్ లీ), పదో వికెట్ 209 (జాన్సన్) పరుగుల వద్ద వికెట్లను కోల్పోయింది.
దీంతో నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 2-0 తేడాతో కైవసం చేసుకుంది. 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును ఆసీస్ స్పిన్ బౌలర్ క్రేజా సొంతం చేసుకోగా, 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్'ను భారత ఫాస్ట్ తురుపుముక్క ఇషాంత్ శర్మ అందుకున్నాడు.