డ్రాగా ముగిసిన ఢిల్లీ టెస్ట్

ఎన్నో ఆశలు పెట్టుకున్న ఢిల్లీ టెస్ట్ డ్రాగా ముగిసింది. ఆఖరి రోజైన ఆదివారం భారత్ నిర్ధేశించిన 245 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా జట్టు కేవలం ఎనిమిది ఓవర్లు మాత్రమే ఆడి, 31 పరుగులు చేసింది. ఈ సమయంలో ఇరు జట్ల కెప్టెన్లు ఒక అంగీకారానికి వచ్చి డ్రాగా ముగించారు.

దీంతో నాలుగు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌లో రెండు టెస్ట్‌లు డ్రాగా ముగియగా, ఒక టెస్ట్‌లో భారత్ విజయం సాధించి, 1-0 ఆధిక్యంలో ఉంది. ఆసీస్ భవితవ్యాన్ని శాసించే చివరి టెస్ట్ మ్యాచ్ నాగ్‌పూర్‌లోజరుగనుంది. అంతకుముందు ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్ల మైదానంలో జరిగిన మూడో టెస్ట్‌లో తొలుత టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది.

భారత జట్టులో గంభీర్ (206), లక్ష్మణ్ (200 నాటౌట్) డబుల్ సెంచరీలు చేయడంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 613 పరుగులు చేసింది. అనంతరం ఆసీస్ జట్టు కూడా అంతే ధీటుగా స్పందించింది. తన తొలి ఇన్నింగ్స్‌లో 577 పరుగులు చేసింది. భారత ఆటగాళ్ళ చెత్తఫీల్డింగ్ లొసుగులను అందిపుచ్చుకున్న కంగారులు రెచ్చిపోయారు.

ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో భారత్ ఐదు వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 36 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకుని ప్రత్యర్థి జట్టు ముంగిట భారత్ 245 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. ఓవర్లు తక్కువగా ఉండటం, సమయం లేక పోవడంతో మ్యాచ్ డ్రాగా ముగించేందుకు ఇరు జట్లు కెప్టెన్లు అంగీకరించారు.

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును లక్ష్మణ్‌ అందుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో అర్థసెంచరీతో రాణించినందుకు లక్ష్మణ్‌ను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డుకు ఎంపిక చేశారు.

వెబ్దునియా పై చదవండి