ఢిల్లీ టెస్ట్: తొలి రోజు భారత్ స్కోరు 296/3

పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టుతో స్వదేశంలో జరుగుతున్న మూడో టెస్ట్‌లో భారత్ తొలి రోజు తొలి ఇన్నింగ్స్‌లో 296 పరుగులు చేసింది. ఓపెనర్ సెహ్వాగ్ (1), ద్రావిడ్ (11), సచిన్ (68) వికెట్లను మాత్రమే కోల్పోయింది. మరో ఓపెనర్ గంభీర్ 149, లక్ష్మణ్ 54 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 139 పరుగులు జోడించి, భారత్‌ను సురక్షితమై స్థానంలో ఉంచారు.

దీంతో భారత్ తొలిరోజు ఆసీస్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించింది. అంతకుముందు టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న విషయం తెల్సిందే. ఓపెనర్లు గంభీర్, సెహ్వాగ్‌లు మంచి శుభారంభాన్ని విఫలమయ్యారు. సెహ్వాగ్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఎల్బీగా పెవిలియన్‌ చేరుకున్నాడు. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన ద్రావిడ్ సైతం నిరాశపరచడంతో భారత్ కేవలం 27 పరుగులకే రెండు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది.

అయితే.. గంభీర్‌తో జతకట్టిన టెండూల్కర్ జట్టు స్కోరును పెంచారు. వీరిద్దరు ముఖ్యంగా.. సచిన్ ఆసీస్ బౌలర్లపై విరుచుక పడ్డారు. మూడో వికెట్‌కు 130 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సచిన్ తన వ్యక్తిగత స్కోరు 68 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. అప్పటికి భారత్ స్కోరు 157 పరుగులు.

అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన లక్ష్మణ్ కూడా ధాటిగా ఆడటంతో భారత్ తొలి రోజు ఆటముగిసే సమయానికి 296 పరుగులు చేసింది. గంభీర్ 149 పరుగులతో, లక్ష్మణ్ అర్థ సెంచరీ పూర్తి చేసుకుని 54 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో జాన్సన్ రెండు, బ్రెట్ లీ ఒక వికెట్ పడగొట్టారు.

వెబ్దునియా పై చదవండి