ఢిల్లీ టెస్ట్: ధీటుగా స్పందించిన కంగారులు

ఢిల్లీలోని ఫిరోజ్‌షాకోట్ల మైదానంలో జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఆస్ట్రేలియా జట్టు భారత్‌కు ధీటుగా స్పందించింది. మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టు ఆరు వికెట్ల నష్టానికి 613 పరుగులు చేసి డిక్లేర్ చేసిన విషయం తెల్సిందే. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ చేపట్టిన కంగారులు.. అంతే ధీటుగా స్పందించారు. మ్యాచ్ నాలుగో రోజున మధ్యాహ్నం టీ సమయానికి 577 పరుగులకు ఆలౌట్ అయ్యారు.

దీంతో భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 36 పరుగులు మాత్రమే ఆధిక్యం లభించాయి. ఇదిలావుండగా మూడో రోజున ఆసీస్ బౌలర్లు హెడెన్, కటిచ్, కెప్టెన్ రికీ పాంటింగ్ ఆదుకుంటే.. నాలుగో రోజున మైకేల్ క్లార్క్ ఇన్నింగ్స్‌ ఆసీస్‌కు వెన్నెముకగా నిలిచింది. క్లార్క్‌కు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్లు సంపూర్ణ సహకారాన్ని అందించారు.

దీంతో ఢిల్లీ టెస్ట్‌పై భారత్ పట్టు బిగించడం కష్టమైంది. భారత బౌలర్లలో సెహ్వాగ్ అద్భుతంగా బౌలింగ్ చేసి ఐదు వికెట్లు పడగొట్టగా, అనిల్ కుంబ్లే మూడు, అమిత్ మిశ్రా రెండు వికెట్లను తీసుకున్నారు. ఆసీస్ వికెట్లన్నీ భారత స్పిన్నర్లే దక్కించుకోవడం గమనార్హం.

అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన భారత్.. ఆట ముగిసే సమయానికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 43 పరుగులు చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 36 పరుగులతో కలుపుకుని 79 పరుగుల ఆధిక్యాన్ని భారత్ కూడగట్టుకుంది. మరో రోజు ఆటమాత్రమే మిగిలివుంది. దీంతో ఢిల్లీ టెస్ట్ డ్రాగా ముగియడం ఖాయమని తేలిపోయింది.

వెబ్దునియా పై చదవండి