గవాస్కర్ - బోర్డర్ సిరీస్‌లో భాగంగా నాగ్‌పూర్‌లో జరుగుతున్న ఆఖరి టెస్ట్ రసదాయకంలో పడింది. భారత్ తన రెండో ఇన్నింగ్స్‌లో 295 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఆస్ట్రేలియా ముంగిట 382 పరుగుల విజయలక్ష్యం ఉంచింది. నాలుగో రోజు చివరి సెషన్స్‌లో ఒక ఓవర్ ఆడిన ఆస్ట్రేలియా 13 పరుగులు పిండుకుంది. వెలుతురు సరిగా లేనికారణంగా మ్యాచ్‌ను నిర్ణీత సమయం కంటే ముందుగా నిలిపివేశారు.
కాగా, ఆసీస్ విజయం సాధించాలంటే మరో 370 పరుగులు చేయాల్సి వుంది. అంతకుముందు.. నాలుగో రోజు ఉదయం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత ఆటగాళ్లు.. వేగంగా పరుగులు సాధించాలనే తాపత్రయంతో వికెట్లను పారేసుకున్నారు. ఓపెనర్లు మంచి శుభారంభాన్ని ఇచ్చినా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్స్ దాన్ని సద్వినియోగం చేసుకోలేక పోయారు. సెహ్వాగ్ (92), విజయ్ (41) పరుగులు చేసి గట్టి పునాది వేశారు. వీరి అవుట్ అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన ద్రావిడ్ (3), టెండూల్కర్ (12), లక్ష్మణ్ (4), గంగూలీ (0)లు వెంటవెంటనే అవుట్ అయ్యారు.
ఆ తర్వాత కెప్టెన్ ధోనీ (55), హర్భజన్ (52) రాణించడంతో భారత్ ఆ పాటి స్కోరు చేయగలిగింది. 82.4 ఓవర్లలో భారత్ 295 పరుగులకు ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా బౌలర్లలో క్రేజా, వాట్సన్‌లు నాలుగేసి వికెట్లు తీయగా, బ్రెట్ లీ ఒక వికెట్ తీశాడు. ఆ తర్వాత 382 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా వికెట్ నష్ట పోకుండా 13 పరుగులు చేసింది. ఓపెనర్లు హెడెన్ (5), కటిచ్ (8) పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.