మొహాలీ టెస్ట్ : గెలుపు దిశగా భారత్

సోమవారం, 20 అక్టోబరు 2008 (17:44 IST)
మొహాలీలో ఆస్ట్రేలియాతో జరుగుతోన్న రెండో టెస్ట్‌లో భారత్ విజయం దిశగా పయనిస్తోంది. ఈ టెస్ట్‌లో ఐదోరోజైన మంగళవారం భారత్ మరో ఐదు వికెట్లు సాధించగల్గితే ఈ టెస్ట్‌లో విజయం లభిస్తుంది. ఈ నేపథ్యంలో నాలుగోరోజైన సోమవారం ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తన రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల నష్టానికి 141 పరుగుల వద్ద ఎదురీదుతోంది. క్లార్క్ (42), హడ్డీన్ (37)లు క్రీజులో ఉన్నారు.

భారత్ విధించిన 516 పరుగుల విజయ లక్ష్యాన్ని సాధించేందుకు బరిలో దిగిన ఆస్ట్రేలియాకు ప్రారంభం నుంచే కష్టాలు ప్రారంభం అయ్యాయి. ఓపెనర్లు హెడెన్ (29), కటిచ్ (20)లు తక్కువ స్కోరుకే అవుట్ కాగా అటుపై క్రీజులోకి వచ్చిన కెప్టెన్ పాంటింగ్ (2), హస్సీ (1), వాట్సన్ (2)లు సైతం భారత బౌలర్ల ధాటికి త్వరగానే నిష్క్రమించారు. భారత బౌలర్లలో హర్భజన్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టగా ఇషాంత్ శర్మ రెండు వికెట్లు దక్కించుకున్నాడు.

ఓవర్‌నైట్ స్కోరు వికెట్ నష్టపోకుండా 100 పరుగులతో నాలుగోరోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్‌కు ఓపెనర్లు మళ్రీ శుభారంభం పలికారు. దీంతో మూడు వికెట్ల నష్టానికి 314 పరుగుల వద్ద కెప్టెన్ ధోనీ ఇన్నింగ్స్‌ను డిక్లెర్ చేశాడు. భారత రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు సెహ్వాగ్ (90), గంభీర్ (104)లు రెచ్చిపోయారు. వీరికి తోడు పస్ట్ డౌన్‌లో బరిలో దిగిన కెప్టెన్ ధోనీ (68 నాటౌట్) కూడా విరుచుకుపడడంతో భారత్ మ్యాచ్‌ను శాసించే స్థితికి చేరింది.

దీంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 201 పరుగులను కలుపుకుని 516 పరుగుల విజయ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ముందుంచింది. ఈ టెస్ట్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 469 పరుగుల భారీ స్కోరు సాధించిన భారత్ 268 పరుగులకే ఆస్ట్రేలియాను ఆలౌట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆస్ట్రేలియా ఫాలో ఆన్ ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అయితే భారత కెప్టెన్ ధోనీ మాత్రం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకున్నాడు. ధోనీ తీసుకున్న నిర్ణయానికి బలం చేకూరుస్తూ ఓపనర్లు మరోసారి భారత్‌కు శుభారంభాన్నిచ్చారు.

వెబ్దునియా పై చదవండి