వెస్టిండీస్‌తో ఇటీవల జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు క్లీన్‌స్వీప్ చేసింది. తొలి టెస్ట్‌లో పది వికెట్ల తేడాతో విజయభేరి మోగించిన ఇంగ్లాండ్ జట్టు, రెండో టెస్ట్ మ్యాచ్‌లోనూ అదే జోరు కొనసాగించింది. సిరీస్ మొత్తం అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న మ్యాన్ ఆఫ్ ది సిరీస్ రవి బొపారా రెండు మ్యాచ్ విజయాల్లోనూ కీలకపాత్ర పోషించాడు.
బొపారా రెండు టెస్ట్‌ల మొదటి ఇన్నింగ్స్‌లో (143, 108) సెంచరీలు సాధించాడు. మ్యాచ్‌ల వివరాలు పరిశీలిస్తే.. మొదటి టెస్ట్ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 377 పరుగులు చేయగా, వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో అనూహ్యంగా 156 పరుగులకే ఆలౌటయింది. అనంతరం ఫాలోఆన్ ఆడుతూ 256 పరుగులు మాత్రమే చేసిన వెస్టిండీస్ 31 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని మాత్రమే మూటగట్టుకుంది. ఇంగ్లాండ్ 32 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించి, సిరీస్‌లో 1-0 ఆధిక్యత సాధించింది.
రెండో టెస్ట్ మ్యాచ్‌లోనూ ఇంగ్లాండ్ చేతిలో వెస్టిండీస్ దారుణంగా ఓడింది. తొలి ఇన్నింగ్స్‌ను ఇంగ్లాండ్ 569 పరుగుల భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేయగా, అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ 310 పరుగులకే ఆలౌటయింది. ఫాలోఆన్‌లోనూ 176 పరుగుల వద్ద చేతులెత్తేసింది. దీంతో ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 83 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన ఇంగ్లాండ్ విజ్డెన్ ట్రోఫీని 2-0తో కైవసం చేసుకుంది.