క్రికెట్ ప్రేమికులకు ఈరోజు నుండి పండగే..

గురువారం, 30 మే 2019 (11:55 IST)
క్రికెట్ అభిమానులకు అసలైన పండుగ ఇవాళే ప్రారంభం కానుంది. సగటు క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న క్రికెట్ సంబరం క్రికెట్ వరల్డ్‌కప్ ఇవాళే ప్రారంభం కానుంది. క్రికెట్ పుట్టిన గడ్డపైనే ప్రపంచకప్‌ 2019 సంబరం ఆరంభమవుతోంది. మొత్తం 10 జట్లు ఈ సిరీస్‌లో పాల్గొననుండగా 46 రోజుల పాటు 48 మ్యాచ్‌లు జరగనున్నాయి. 
 
తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌తో దక్షిణాఫ్రికా జట్టు తలపడనుంది. ఇక ఐసీసీ ప్రపంచకప్‌ బుధవారం అధికారికంగా ఆరంభమైంది. పది జట్ల కెప్టెన్లు బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ను కలుసుకున్నారు. బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ ముందు జరిగిన ప్రారంభ కార్యక్రమంలో ‘60 సెకన్ల ఛాలెంజ్‌’ పేరుతో రబ్బరు బంతితో సరదాగా గల్లీ క్రికెట్‌ ఆడించారు. ప్రతి జట్టు తరపున ఇద్దరు బ్యాటింగ్‌ చేశారు. భారత్‌కు కుంబ్లే, ఫర్హాన్‌ అక్తర్‌ ప్రాతినిధ్యం వహించారు. అక్కడ ఉన్న జనాలే బౌలర్లుగా ఒక నిమిషంలో వీలైనన్ని బంతులు వేశారు. ఇంగ్లండ్ జట్టు 74 పరుగులతో విజేతగా నిలిచింది.
 
వరల్డ్‌కప్ సాధన ధ్యేయంగా అన్ని జట్లు సిద్ధంగా ఉన్నాయి. ప్రతి జట్టులో యువ క్రికెటర్లు ఉండడంతో వారిపై అంచనాలు సైతం అదే స్థాయిలో ఉన్నాయి. భారత్ విషయానికి వస్తే రోహిత్, శిఖర్ ధవన్ జోడీ ఓపెనింగ్‌లో కుదురుకుంటే భారీ పరుగులు సాధించడం పెద్ద విషయమేమీ కాదు. కోహ్లీ, ధోనీ, కేఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్‌లో ఎటూ ఉండనే ఉన్నారు. 
 
మరోవైపు భారత జట్టు అమ్ముల పొదిలో బ్రహ్మాస్త్రం జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్ ద్వయంతో ఫేస్ విభాగం బలంగా ఉంది. చాహల్, జడేజా వంటి స్పిన్నర్లు ఎటూ ఉండనే ఉన్నారు. అందరూ సమిష్టిగా రాణించితే వరల్డ్‌కప్ సాధించడం పెద్ద విషయమేమీ కాదని విశ్లేషకులు చెబుతున్నారు. 
 
మరోవైపు ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్లకు ఎన్నో ఏళ్లుగా కలలా మిగిలిన వరల్డ్‌కప్ సాధన ఈ సారైనా సాధ్యమవుతుందో లేదోనని సాటి అభిమానులు పెదవి విరుస్తున్నారు. కాగా విజేతగా నిలవడానికి అన్ని వనరులు తనకు ఉన్నాయన్న ధీమాతో టీమ్‌ఇండియా వరల్డ్‌కప్ బరిలో నిలిచింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు