అప్పుడు విమర్శలు-ఇప్పుడు ప్రశంసలు.. జడేజాపై మంజ్రేకర్

శుక్రవారం, 12 జులై 2019 (08:16 IST)
ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా ఇండియా-న్యూజిలాండ్ మధ్య జరిగిన సెమీఫైనల్లో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అదరగొట్టిన విషయం తెలిసిందే. న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓడిపోయినా జడేజా పోరాటస్పూర్తి అందరినీ ఆకట్టుకుంది.

రోహిత్, కోహ్లీ వంటి దిగ్గజాలు బ్యాటింగ్ చేయడానికి ఇబ్బందిపడిన పిచ్ పై అతడు 59 బంతుల్లోనే 77 పరుగులు చేసి భారత్ ను గెలిపించినంత పని చేశాడు. ఇలా తీవ్ర ఒత్తిడిని కూడా అధిగమించి అద్భుతంగా బ్యాటింగ్ చేసిన అతడిపై గతంలో విమర్శలు చేసిన వారే ఇప్పుడు ప్రశంసలు కురిపిస్తున్నారు. అలా సంజయ్ మంజ్రేకర్ కూడా జడేజాను పొగడ్తలతో ముంచెత్తాడు. 
 
గతంలో తాను జడేజాను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తప్పని ఈ  ఇన్నింగ్స్ నిరూపించిందని మంజ్రేకర్ అన్నారు. ఇంత అద్భుతంగా ఆడే జడేజాను ఇదివరకెప్పుడు చూడలేదని ప్రశంసించాడు. ఇంతకు ముందు 40 మ్యాచుల్లో జడేజా చేసిన అత్యధిక పరుగులు 33 మాత్రమే. అందువల్లే అతడి ఆటతీరుపై గతంలో అలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చాడు.

అయితే తాజాగా న్యూజిలాండ్ తో జరిగిన సెమీఫైనల్లో అతడి ఆడిన విధానం అద్భుతమని... అతడి బ్యాటింగ్ టీమిండియా గెలుపుపై ఆశలు కలిగించిందని పేర్కొన్నాడు. అయితే అతడి ఒంటరిపోరాటం వృధా కావడం తననెంతో బాధించిందని... కానీ పోరాట స్పూర్తి అద్భుతమని మంజ్రేకర్ కొనియాడాడు. 
 
అయితే ఇటీవల మంజ్రేకర్-జడేజాల మధ్య మాటల యుద్దం కొనసాగి తీవ్ర దుమారాన్ని రేపింది.  ''రవీంద్ర జడేజా వంటి క్రికెటర్ నేను అభిమాని కాదు...అతడికి తుది జట్టులో చోటు కల్పించడం వల్ల కలిగే లాభమేమీ వుండదు'' అంటూ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. దీనికి సీరియస్ గా రియాక్ట్ అయిన జడ్డూ ట్విట్టర్ ద్వారా మంజ్రేకర్ పై గరం అయ్యాడు.  '' నీ కంటే నేను బాగానే ఆడాను... ఆడుతున్నాను కూడా. నువ్వు నా గురించి ఆలోచించడం మానేయ్. మరోసారి నా గురించి నోరుజారావో బావుండదు'' అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. 
 
ఈ వివాదం ఇండియన్ క్రికెట్లో తీవ్ర దుమారాన్ని రేపింది. అయితే తాజాగా జడేజా ఇన్నింగ్స్ తో ఆ వివాదానికి తెరపడింది. మంజ్రేకర్ జడేజాపై చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుని అతన్ని పొగడటంతో వీరిద్దరి మధ్య వేడి వాతావరణం తగ్గినట్లేనని అభిమానులు భావిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు