ప్రియుడు కోసం కోడికూరలో మత్తు మందు కలిపి తండ్రినే చంపించిన బాలిక

శనివారం, 13 నవంబరు 2021 (14:46 IST)
కన్నతండ్రినే చంపించిన ఘాతుకం వెలుగుచూసింది. తన ప్రేమకు అడ్డుగా వున్నాడని కన్నతండ్రినే సుపారీ ఇచ్చి హత్య చేయించింది ఓ బాలిక. ఆ తర్వాత ఏమీ ఎరగనట్లు కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసారు. కానీ పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేసి నిందితులందరినీ అరెస్టు చేసి రిమాండుకి తరలించారు.

 
ఈ దారుణ ఘటన హైదరాబాదులోని కుషాయిగూడలో జరిగింది. 49 ఏళ్ల రామకృష్ణ, తన భార్య-కుమార్తెలతో కలిసి కాప్రాలో నివాసం వుంటున్నాడు. జూలై 20న తలకు బలమైన గాయాలతో రామకృష్ణను కుటుంబ సభ్యులు స్థానిక ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. ఐతే అతడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. తలకు గాయం కావడంతో అతడు మృతి చెందినట్లు చెప్పారు. కానీ పోస్టుమార్టం నివేదికలో అసలు నిజం బయటపడింది. రామకృష్ణను గొంతు నులిమి చంపేసినట్లు నివేదికలో తేలింది. దీనితో కుటుంబ సభ్యుల వద్ద పోలీసులు తమదైన శైలిలో విచారించారు.

 
ఆ విచారణలో నిజాలు బయటపడ్డాయి. ఇంతకుముందు రామకృష్ణ కుటుంబం నారాయణగూడలోని ఓ అపార్టుమెంటులో వుండేది. అక్కడ అపార్టుమెంట్ వాచ్‌మెన్ కుమారుడు భూపాల్‌తో రామకృష్ణ కుమార్తె ప్రేమలో పడింది. విషయం తెలుసుకున్న రామకృష్ణ కుమార్తెను మందలించాడు. ఐతే భూపాల్ మాత్రం బాలికకు మాయమాటలు చెప్పి రామకృష్ణ ఇంట్లో చోరీకి పాల్పడి రూ. 1.75 లక్షలు దోచుకున్నాడు.

 
కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని రిమాండుకి తరలించారు. ఇక అక్కడ లాభం లేదని రామకృష్ణ తన నివాసాన్ని నారాయణగూడ నుంచి కాప్రాకు మార్చాడు. ఐతే భూపాల్ మాత్రం బాలికకు మాయమాటలు చెప్పి, రామకృష్ణను అడ్డు తొలగిస్తే హాయిగా వుండొచ్చని చెప్పాడు. దాంతో ఇద్దరూ కలిసి ఓ గ్యాంగ్‌ను కలిసి సుపారీ ఇచ్చారు. అనుకున్న ప్రకారం రామకృష్ణ కుమార్తె తన తల్లిదండ్రులు తినే కోడికూరలో మత్తు గుళికలు కలిపింది.

 
ఇద్దరూ మత్తులోకి జారుకోగానే గ్యాంగ్ కి సమాచారం అందించింది. ఆ గ్యాంగ్ తో కలిసి కన్నతండ్రిని అతి దారుణంగా చంపేసింది. రామకృష్ణ గొంతు నులమడమే కాకుండా అతడి తలపై కత్తితో బలంగా పొడిచారు. దీనితో అతడు మత్తు నుంచి బయటకు రావడంతో అంతా పరారయ్యారు. తెల్లవారాక రామకృష్ణను ఆసుపత్రికి తరలించారు. నిజం చెబితే కుమార్తె ప్రేమ వ్యవహారం బయటపడుతుందని దాచిపెట్టారు. కానీ పోస్టుమార్టం నివేదికలో అంతా తేలింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు