తమిళనాడులోని కోయంబత్తూరు అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో దారుణం జరిగింది. కోయంబత్తూరులోని ఓ ప్రముఖ కళాశాలలో చదువుతున్న విద్యార్థినిని ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు అపహరించి సామూహిక అత్యాచారం చేశారు. బాధితురాలు విమానాశ్రయం వెనుక ఉన్న ఖాళీ స్థలంలో తీవ్రంగా గాయపడి దుస్తులు లేకుండా కనిపించింది. ఈ సంఘటన ఆదివారం రాత్రి ఆలస్యంగా వెలుగుచూసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కోయంబత్తూరు నగరంలోని ఒక ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చదువుతున్న విద్యార్థిని రాత్రి 11 గంటల ప్రాంతంలో తన స్నేహితురాలు ఫోన్ చేయడంతో విమానాశ్రయం వెనుక ఉన్న రోడ్డుపై ఆపి మాట్లాడుతోంది. ఆమెతో పాటు ప్రక్కనే ఆమె స్నేహితుడు కూడా వున్నాడు. అది నిర్మానుష్య ప్రాంతం కావడంతో అకస్మాత్తుగా, ముగ్గురు దుండగులు కారు వద్దకు తొలుత బాధితురాలి స్నేహితుడిపై దాడి చేసి గాయపరిచారు. అనంతరం ఆమెను బలవంతంగా చీకటిలోకి ఈడ్చుకెళ్లారు. ఆ తర్వాత ఆమెపై ముగ్గురూ అత్యాచారం చేసి దుస్తులు తీసేసి అక్కడి నుంచి పారిపోయారు. ఆమె తీవ్రంగా గాయపడిన స్థితిలో మిగిలిపోయింది.
తీవ్రంగా గాయపడిన బాధితారాలి స్నేహితుడు విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసాడు. వెంటనే పోలీసు బృందం విస్తృతంగా వెతికిన తర్వాత, బాధితురాలు సమీపంలోని ఖాళీ స్థలంలో అపస్మారక స్థితిలో, దుస్తులు లేకుండా కనిపించింది. ఆమెను వెంటనే రక్షించి ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు, అక్కడ ఆమె తీవ్ర షాక్‌లో ఉన్నప్పటికీ ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆమె స్నేహితుడు వినీత్‌ను చికిత్స కోసం కోయంబత్తూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.