మైనర్ బాలికపై ఐదుగురు కామాంధుల సామూహిక అత్యాచారం.. ఎక్కడ?
బుధవారం, 8 డిశెంబరు 2021 (20:41 IST)
హైదరాబాద్ నగరంలో మరో దారుణం జరిగింది. స్థానిక సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మైనర్ బాలిక సామూహిక అత్యాచారానికి గురైంది. ఈ బాలికపై ఆమె ప్రియుడితో పాటు అతని నలుగురు స్నేహితులు పలుమార్లు అత్యాచారం చేశారు.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ నెల 30వ తేదీన సుల్తాన్ బజార్ ప్రాంతానికి చెందిన ఓ బాలిక అదృశ్యమైంది. దీనిపై ఆ బాలిక తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఈ నెల 3వ తేదీన బాలికను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద విచారణ జరుపగా, తన స్నేహితులతో కలిసి ఇంటి నుంచి బయటకు వచ్చినట్టు చెప్పారు.
ఆ తర్వాత ఐదుగురు కలిసి మేడిపల్లి ప్రాంతంలో తనపై పలుమార్లు అత్యాచారం జరిపారని మైనర్ బాలిక బోరున విలపిస్తూ చెప్పింది. బాధితురాలు ఇచ్చిన సమాచారం మేరకు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు.