అద్దెకున్న వ్యక్తిని చంపిన ఇంటి యజమాని.. ఎందుకో తెలుసా?

శుక్రవారం, 16 డిశెంబరు 2022 (10:53 IST)
తన ఇంట్లో అద్దెకు ఉన్న వ్యక్తిని ఇంటి యజమాని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని మూడు ముక్కలు చేశాడు. దీనికి కారణం.. అద్దెకు ఉన్న వ్యక్తికి కోటి రూపాయలు ఉన్నఫళంగా రావడంతో వాటిని తన వశం చేసుకునేందుకు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఘజియాబాద్‌లోని మోదీనగర్‌కు చెందిన ఉమేశ్ శర్మ అనే వ్యక్తి ఇంట్లో అంకిత్ జోకర్ అనే వ్యక్తి అద్దెకు నివసిస్తున్నారు. ఈయన లక్నో యూనివర్శిటీలో పీహెచ్సీగా పనిచేస్తున్నాడు. కొన్నేళ్ల కిందట తల్లిదండ్రులు మరణించడంతో ఒంటరిగా అద్దె ఇంట్లో ఉంటున్నారు. 
 
ఈ క్రమంలో తనకు వారసత్వంగా వచ్చిన భూమిని అకింత్ జోకర్ విక్రయించాడు. దీంతో కోటి రూపాయలు వచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న ఇంటి యజమాన్ని ఆ సొమ్ముపై కన్నేశాడు. అక్టోబరు 6వ తేదీన అంకిత్‌ను హత్య చేసి, మూడు ముక్కలుగా నరికాడు. వాటిని అల్యూమినియం పేపర్లో ప్యాక్ చేశాడు. 
 
వీటిలో ఒక భాగాన్ని ముజఫర్‌నగర్‌లోని ఖటౌలి వద్ద కాలువలో పడేశాడు. మరో భాగాన్ని ముసోరి కాలువలో విసిరేశాడు. మూడో భాగాన్ని ఓ ఎక్స్‌ప్రెస్ వే పక్కన పడేశాడు. అయితే, కొన్ని వారాల పాటు అంకిత్ ఫోన్ కాల్స్‌కు స్పందించకపోవడంతో అతని స్నేహితులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టగా ఇంటి యజమాని ఉమేశ్ శర్మే అంకిత్‌ను హత్య చేసినట్లు నిర్ధారించారు. బుధవారం అతన్ని అరెస్టు చేశారు. అంకిత్ ఏటీఎం కార్డును ఉప యోగించి పలు దఫాలుగా రూ.20 లక్షలు విత్ డ్రా చేసినట్లు పోలీసులు గుర్తించారు. 
 
మరిన్ని డబ్బులు ఉత్తరాఖండ్‌లో విత్ డ్రా చేయాలంటూ ఏటీఎం కార్డును ఉమేశ్ తన స్నేహితుడైన పర్వేశ్‌కు ఇచ్చాడు. అలాగే పోలీసులు విచారణను తప్పుదోవ పట్టించేందుకు అంకిత్ ఫోన్‌ను కూడా అతనికి ఇచ్చి పంపాడు. ఉమేశ్‌తో పాటు పర్వేశ్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. 

వెబ్దునియా పై చదవండి