కుమారుడుకి విషమిచ్చి.. కుమార్తెకు ఉరివేసి చంపేశారు.. దంపతుల ఆత్మహత్య!!

ఠాగూర్

మంగళవారం, 11 మార్చి 2025 (09:05 IST)
ఆర్థిక ఇబ్బందులు నలుగురి ప్రాణాలు తీశాయి. తొలుత తమ ఇద్దరు పిల్లను హత్య చేసిన భార్యాభర్తలు ఆ తర్వాత తాము కూడా ఆత్మహత్య చేసుకున్నారు. కుమారుడుకి విషమిచ్చి చంపేసిన ఆ దంపతులు.. తమ కుమార్తెకు మాత్రం ఉరేసి ప్రాణం తీశారు. గత ఆరు నెలలు ఉద్యోగం లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో ప్రాణాలు తీసుకున్నారు. 
 
హైదరాబాద్ నగరంలోని హబ్సిగూడలో పెను విషాదం చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు భరించలేక ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం, కల్వకుర్తికి చెందిన చంద్రశేఖర్ రెడ్డి (44), కవిత (35) దంపతులు యేడాది క్రితం హబ్సిగూడకు వచ్చారు. వీరికి విశ్వాన్ రెడ్డి (10), శ్వేతారెడ్డి (15) అనే ఇద్దరు సంతానం. 
 
చంద్రశేఖర్ రెడ్డి కొంతకాలంపాటు ఒక ప్రైవేటు కాలేజీలో లెక్చరర్‌గా పని చేసే మానేశారు. ఆరు నెలలుగా ఉద్యోగం లేకపోవడంతో కుటుంబాన్ని ఆర్థిక సమస్యలు వెంటాడాయి. ఈ నేపథ్యంలో సోమవారం విశ్వాన్ రెడ్డికి విషమిచ్చి, కుమార్తె శ్వేతారెడ్డికి ఉరివేసి చంపేశారు. ఆపై భార్యాభర్తలు ఇద్దరూ ఉరేసుకున్నారు. 
 
తన చావుకు ఎవరూ కారణం కాదని వేరే మార్గం లేక ఆత్మహత్య చేసుకుంటున్నామని, తమను క్షమించాలంటూ చంద్రశేఖర్ రెడ్డి రాసిన ఆత్మహత్య లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేరీర్ పరంగాను, శారీరకంగాను, మానసికంగాను సమస్యలు ఎదుర్కొంటున్నానని, షుగర్, నరాలు, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్టు చంద్రశేఖర్ రెడ్డి అందులో పేర్కొన్నారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు