రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ నగరంలో దారుణం జరిగింది. ఓ పోలీస్ అధికారి కొడుకు ఒకడు వీధిలో కూరగాయలు అమ్ముకునే చిరు వ్యాపారిని క్రికెట్ బ్యాట్‌తో కొట్టి చంపేశాడు. తమ ఇంటి ముందు కూరగాయల దుకాణం పెట్టాడన్న కోపంతో ఈ దారుణానికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియోను సచిన్ గుప్తా అనే యూజర్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయడంతో అది వైరల్ అయింది.
జైపూర్‌లోని రజనీ విహార్ కాలనీలో మోహన్ అనే వ్యక్తి ఓ చిరు వ్యాపారి. ఓ వీధిలో కూరగాయలు అమ్ముకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే, క్షితిజ్ అనే వ్యక్తి ఓ పోలీస్ అధికారి కుమారుడు. తమ ఇంటి ముందు మోహన్ కూరగాయల షాపు పెట్టాడు. అది నచ్చని క్షితిజ్ ఇంట్లో నుంచి క్రికెట్ బ్యాటు తీసుకుని వెళ్లి మోహన్ తలపై మూడుసార్లు బలంగా బాదాడు.
ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన చిరు వ్యాపారి అక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి రావడంతో అవి వైరల్ అయ్యాయి. ఈ వీడియోలోని దృశ్యాల ఆధారంగా నిందితుడు క్షితిజ్‌ను పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. కాగా క్షితిజ్ తండ్రి భజన్‌లాల్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయంలో పోలీస్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నట్టు సమాచారం.