కేరళలో సంచలనం రేకెత్తించిన విస్మయ మృతి కేసులో ప్రధాన నిందితుడైన ఆమె భర్త ఎస్. కిరణ్ కుమార్‌ను దోషిగా తేల్చింది కేరళ కోర్టు. భార్యను అదనపు కట్నం కోసం వేధించి, ఆమె ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించిన నేరం కింద అతడికి పదేళ్ల జైలు, రూ. 12.55 లక్షల జరిమానా విధించింది. ఈ మొత్తంలో రూ. 2 లక్షలు విస్మయ తల్లిదండ్రులకు చెల్లించాలని తీర్పునిచ్చింది. అంతకుముందు కేరళ సర్కారు నిందితుడిని ఉద్యోగం నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.
కేసు వివరాల్లోకి వెళితే.. కొల్లంకు చెందిన కిరణ్ కుమార్(30), కడక్కల్‌లోని కైతోడ్ నివాసి అయిన విస్మయ వి నాయర్(22)కు గతేడాది పెద్దలు వివాహం చేశారు. మోటార్ వెహికిల్స్ ఇన్‌స్పెక్టర్ అయిన కిరణ్‌కు పెళ్లి సమయంలో భారీగా కట్నకానుకలు ఇచ్చారు విస్మయ తల్లిదండ్రులు. 800 గ్రాముల బంగారం, సుమారు ఒక ఎకరం భూమి, ఖరీదైన కారు ముట్టజెప్పారు. కానీ అదనపు కట్నం కోసం అతడు వేధించడం మొదలుపెట్టాడు.
కొత్త కారు, ఇంకొంత నగదు కావాలంటూ శారీరకంగా, మానసికంగా చిత్రహింసలకు గురి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను తన పుట్టింటి వాళ్లకు పంపిన విస్మయ కన్నీళ్లు పెట్టుకుంది. ఈ ఏడాది జూన్ నెలలో ఆమె వాష్‌రూంలో విగతజీవిగా కనబడింది. దీంతో అత్తింటి వాళ్లే ఆమెను హతమార్చారని తల్లిదండ్రులు ఆరోపించారు. కాగా విస్మయ మృతి కేసుతో కేరళలో ఒక్కసారిగా ప్రకంపనలు చెలరేగాయి. సోషల్ మీడియాలో ఈ ఘటనపై చర్చలు సాగాయి. వరకట్న పిశాచికి వ్యతిరేకంగా మరోసారి ఉద్యమాలు ఉధృతమయ్యాయి.
అదే విధంగా విస్మయను బలిగొన్న కిరణ్‌కు తగిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో పోలీసులు అతడిని అరెస్టు చేయగా.. ఉద్యోగం నుంచి సస్పెండ్ అయ్యాడు. ఈ నేపథ్యంలో కిరణ్‌కుమార్‌ను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు కేరళ రవాణా శాఖా మంత్రి ఆంటోనీ రాజు వెల్లడించారు. తాజాగా అతడికి కోర్టు శిక్ష విధించింది.