తాను వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ భర్తను చంపేందుకు ఓ వ్యక్తి కుట్రపన్నాడు. ఇందుకోసం సుపారీ గ్యాంగ్‌తో రూ.20 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. కానీ, నగదు లావాదేవీల్లో తేడా రావడంతో ప్రియురాలి భర్తను హత్య చేయకుండా సుపారీ గ్యాంగ్ వదిలివేసింది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో వెలుగుచూసింది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు... రాము అనే వ్యక్తికి ఓ మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆ మహిళ భర్తను చంపేందుకు ఆమెతో కలిసి రాము కుట్రపన్నాడు. ఇందుకోసం ఓ సుపారీ గ్యాంగ్‌తో రూ.20 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని, ముందుగా రూ.5 లక్షలు నగదు ఇచ్చాడు.
సుపారీ గ్యాంగ్ బాధితుడుని కిడ్నాప్ చేసి హత్య చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే, హత్య చేయడానికి ముందు రాముకు ఫోన్ చేసి మిగతా డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయగా, రాము నిరాకరించాడు. దీంతో సుపారీ గ్యాంగ్ హత్యకు పూనుకోలేదు. పైగా బాధితుడు వద్ద ఉన్న నగదు, నగలను దోచుకున్నారు.
దీనిపై బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగు చూసింది. హత్యకు ఒప్పందం చేసుకున్న ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి మారణాయుధాలతో పాటు రూ.90 వేల నగదు, ఐదు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన జిల్లా కేంద్రంలో కలకలం రేపింది.