ఆమెను నేనే చంపాను.. పోలీసుల ఎదుట లొంగిపోయిన నిందితుడు.. ఎక్కడ?

ఠాగూర్

మంగళవారం, 27 మే 2025 (18:22 IST)
తెలంగాణ రాష్ట్రంలోని సిరిసిల్లా జిల్లాలో ఓ దారుణ హత్య జరిగింది. ఓ వ్యక్తి ఒక మహిళను అతి కిరాతకంగా చంపేశాడు. ఆ తర్వాత హత్యకు ఉపయోగించిన ఆయుధంతో నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి.. తాను ఓ మహిళను హత్య చేశానని, తనను అరెస్టు చేయాలంటూ పోలీసులను కోరాడు. దీంతో పోలీసులు సైతం ఒకింత ఖంగుతిన్నారు. ఆ తర్వాత తేరుకుని ఆ వ్యక్తిని అదుపులోకితీసుకున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
రాజన్న సిరిసిల్లా జిల్లా చందుర్తి మండల కేంద్రానికి చెందిన ఓ మహిళ రోజూలాగే పొలం పనులకు వెళ్లింది. సాయంత్రం పనులు ముగించుకుని ఇంటికి బయలుదేరింది. మార్గమధ్యలో, నడిరోడ్డుపైకి వచ్చిన ఓ వ్యక్తి అకస్మాత్తుగా ఆమెపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. తీవ్రగాయాలపాలైన మహిళ అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందింది. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా ఉలిక్కిపడింది.
 
అయితే, ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుడు నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోవడం గమనార్హం. 'ఆమెను నేనే చంపాను' అంటూ కత్తి కిందపడేసి పోలీసుల ఎదుట నేరాన్ని అంగీకరించాడు. దీంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
 
పోలీసుల ప్రాథమిక విచారణలో నిందితుడికి నేర చరిత్ర ఉన్నట్లు తేలింది. గతంలో వినాయక చవితి పర్వదినం రోజున కూడా ఇదే నిందితుడు మరో వ్యక్తిని హత్య చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం మహిళ హత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పాత కక్షలా? లేక మరేదైనా కారణమా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు